దొరల గడీల పాలనకు సమాధి కట్టాలి - వేముల మహేందర్ గౌడ్

దొరల గడీల పాలనకు సమాధి కట్టాలి - వేముల మహేందర్ గౌడ్

మొగుళ్లపల్లి, ముద్ర: తెలంగాణలో రెడ్డి, వెలమ దొరల గడీల పాలనకుసమాధి కట్టి అణగారిన వర్గాల రాజ్యాన్ని నిర్మించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంఘటితం కావాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణలో 7శాతం లేని అగ్రకులాలకు 7 రాజకీయ పార్టీలుంటే 93శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నాయకత్వం వద్దా..? అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటూ.. అవమాన పరుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపిలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధం ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బహుజన సమాజానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 7శాతం లేని అగ్రకులాలు 93శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పాలించడం అప్రజాస్వామికమని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలిపీఠం ఎక్కింది బీసీ, ఎస్సీ, ఎస్టీలైతే.. రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నది రెడ్డి, వెలమ కులస్తులేనన్నారు. ఎవరి జనాభా ఎంత ఉందో..అంతే వాటా వారికి ఉండాలని భారత రాజ్యాంగం చెబుతోందని మహేందర్ గౌడ్ స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సుబ్బండ కులాల వాటా ఎంత అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు మావే..సీట్లు మావే.. రాజ్యాధికారం మాదే అనే నినాదంతో రెడ్డి, వెలమల గడీల పాలనకు సమాధి కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.