పాత ప్రత్యర్ధులంత ఒకవైపు జీవన్ ఒక వైపు - జగిత్యాలలో ఓటరు తీర్పు ఎటువైపు

పాత ప్రత్యర్ధులంత ఒకవైపు జీవన్ ఒక వైపు - జగిత్యాలలో ఓటరు తీర్పు ఎటువైపు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఒకప్పుడు వారంత ఒకే గూటి పక్షులు... కాలక్రమేణ వారు వివిధ పార్టీలలో చేరి ప్రత్యర్థులుగా మారి ఒకరిని ఒకరు ఒడించు కున్నారు. కాని ఇప్పుడు ప్రత్యర్థులు అందరూ ఒక వైపు ఉంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి మరో వైపు నిలబడి పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డిది నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర.1983 నుంచి జీవన్ రెడ్డి చట్టసభలకు పోటి చేస్తూ వస్తున్నారు. ఎన్ టి రమారావు పార్టీ పెట్టిప్పుడు జీవన్ రెడ్డి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. మొదటి సారి ఎమ్మేల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేశారు.  1985 లో జరగిన ఎన్నికల్లో టిడిపి టికెట్ జీవన్ రెడ్డి కి ఇవ్వకుండా గొడిసెల రాజేశం గౌడ్ కు కేటాయించడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి  పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1989 లో గెలిచిన జీవన్ రెడ్డి 1994లో టిడిపి అభ్యర్థి ఎల్ . రమణ చేతిలో ఓడిపోయారు. 1996 ఉప ఎన్నికలు మొదలుకొని 2004 వరకు గెలుపొందుతు వచ్చారు. 2009 ఎన్నికల్లో ఎల్. రమణ చేతిలో ఓడిపోయిన ఆయన మళ్ళి బిఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ ఫై  2014లో గెలుపొందారు. 2018లో బి ఆర్ ఎస్ అభ్యర్థి డా. సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆనంతరం వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన  ప్రస్తుతం కొనసాగుతున్నారు.

ప్రత్యర్థులంత ఒకవైపు...
ఈ సారి జరగుతున్న అసెంబ్లి ఎన్నికల్లో సైతం జగిత్యాల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోమారు బరిలో నిలిచారు జీవన్ రెడ్డి. అయితే గతంలో జీవన్ రెడ్డి పై పోటి చేసిన ప్రత్యర్థులు మాజీ మంత్రి రాజేశం గౌడ్,  మాజీ మంత్రి, ప్రస్థుత  ఎమ్మెల్సీ ఎల్. రమణ లు బి ఆర్ ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇది వరకు జీవన్ రెడ్డి పై విజయం సాధించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మరోసారి జీవన రెడ్డితో తలపడనున్నారు. గత  ఎన్నికల్లో 60 వేల మెజారటీ సాధించిన సంజయ్ కుమార్ రెండవ సారీ గెలుపొంది మెజారిటీ పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకు మాజీ మంత్రులు అయిన ఎల్ రమణకు బిఆర్ ఎస్ అధిష్టానం నియోజక వర్గ ఎన్నికల ఇంచార్జి భాధ్యతలు అప్పగించగా రాజేశం గౌడ్ కు జగిత్యాల పట్టణ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే పాత ప్రత్యర్థులు అందరూ ఒక వైపు ఉన్న నా గెలుపును ఎవరు ఆపలేరని ధీమాతో జీవన్ రెడ్డి ఉన్నారు. చూడాలి మరి జగిత్యాల నియోజక వర్గ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో.