బోడుప్పల్ ప్రజావాణిలో 39 ఫిర్యాదులు

బోడుప్పల్ ప్రజావాణిలో 39 ఫిర్యాదులు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో సోమవారం తొలిసారిగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 39 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఇంజనీరింగ్, పారిశుధ్య విభాగాలకు చెందినవి 21 ఫిర్యాదులు ఉన్నాయి.  ప్రజాపాలనకు సంబంధించి 12, వక్ఫ్ బోర్డు, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి  ఆరుగురు ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులన్నిటినీ కార్పొరేషన్ కమిషనర్ జి.రామలింగం పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధించిన అధికారులకు వాటిని రిఫర్ చేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్న విషయం విదితమే. అందులో బాగంగా తొలిసారి బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి నిర్వహించారు.కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్  నాగేంద్ర బాబు, ఇద్దరు డిఈఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, తెలంగాణ స్టేట్ ట్రాన్స్కో సెక్షన్, జలమండలి అధికారులు, శానిటేషన్  అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.