సిద్దిపేటలో ఘనంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్

సిద్దిపేటలో ఘనంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్
  • ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
  • కోమటి చెరువు నెక్లెస్ రోడ్ లో ఫిష్ ఫుడ్ అమ్మకాలు 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా మత్స్యశాఖ గురువారం రాత్రి ఏర్పాటుచేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు మూడు రోజులపాటు కోమటి చెరువు వద్ద ఘనంగా నిర్వహిస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలోని పలుచోట్ల చెరువుల వద్ద చేపల అమ్మకాలు, చేపలతో తయారుచేసిన వంటలను మత్స్యకార మహిళలు ప్రజలకు, సందర్శకులకు రుచి చూపించారు.

మృగశిర కార్తె రోజున చేపలను తినడం తెలంగాణలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం కావడంతో ఈరోజే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రారంభించారు. సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ స్థానికులను ఆకట్టుకుంది.జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీల మహిళలు, చేపల వంటలతో స్టాల్స్ నిర్వహించారు.

సిద్దిపేట, చిన్న కోడూరు, ఎన్సాన్ పల్లి చందా పూర్,వేముల ఘాట్, సూరంపల్లి, గ్రామాల మహిళా మచ్చ పారిశ్రామిక సంఘాల సభ్యులు మూడు రోజులపాటు పర్యాటకులకు రుచి చూపించనున్నారు. కోమటి చెరువు వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు ,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పట్టణ కౌన్సిలర్లు మత్స్య శాఖ ఏడి మల్లేశం మత్స్యశాఖ అధికారులు సురేష్ బాబు గౌతమి మత్స్యశాఖ డైరెక్టర్లు అక్కర మల్లేశం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.