‘బోగస్​’ ఫికర్

‘బోగస్​’ ఫికర్
  • ఎన్నికల వేళ అన్ని పార్టీల అలర్ట్
  • దొంగ ఓట్లపై నజర్,​తొలగింపునకు వినతులు
  • పొరుగు రాష్ట్రాల వలస జనాలకూ ఇక్కడ ఓట్లు!
  • ఇప్పటికే వెలుగు చూసిన తొమ్మిది లక్షల బోగస్​పేర్లు
  • నిబంధనలను సరిగా పాటించని అధికారులు
  • గతంలోనూ వివాదాలకు దారి తీసిన ‘నకిలీ’ వ్యవహారం
  • సీఈసీకి ఫిర్యాదు చేసిన పలు పార్టీల నాయకులు
  • దీంతో సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
  • కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం
  • నేటి నుంచి రాష్ట్రంలో సీఈసీ బృందం పర్యటన

నిర్మల్ జిల్లాలో రెండు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో బీజేపీ నిర్వహించిన సర్వేలో బోగస్​ ఓట్లు భారీగా బయటపడ్డాయి. ఒక్క కుటుంబం కూడా నివసించలేని ఇంట్లో ఏకంగా 33 ఓట్లు ఉన్న విషయం ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా ద్వారా వెలుగుచూసింది. మున్సిపాలిటీ లెక్కల ప్రకారం పట్టణంలో 19 వేల నివాస గృహాలు ఉంటే ముసాయిదాలో ఏకంగా వాటి సంఖ్య 26 వేలు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ వ్యవహారం మీద కలెక్టరుకు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలకు బీజేపీ నాయకుడు ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు,

నగరంలోనూ దొంగ ఓట్లు

హైదరాబాదులోని​నాంపల్లి నియోజకవర్గంలో 1.13లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించిన కాంగ్రెస్ నేత​ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్,  ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌ తో కలిసి ఇటీవల హైదరాబాదుకు వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్క సెగ్మెంట్ లోనే భారీగా బోగస్​ ఓట్లు వెలుగుచూడడంతో మిగతా నియోజకవర్గాల్లోనూ వాటి లెక్క తేల్చాలని పార్టీ శ్రేణులను టీపీసీసీ ఆదేశించింది. దీంతో స్థానిక నాయకులు బోగస్​ ఓట్ల తొలగింపు కోరుతూ ఎక్కడికక్కడ ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. బోగస్​ ఓట్లు తొలగించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయ పార్టీలన్నింటికీ బోగస్​ ఓట్ల టెన్షన్​ పట్టుకుంది. గతంలో సాధారణ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వెలుగుచూసిన బోగస్​ ఓట్ల వ్యవహారం, ఫలితాల ప్రకటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ దూమారాన్ని లేపిన విషయం తెలిసిందే. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ యేడాది చివరన తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, దాని మీద అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల కోసం గత నెల 19 వరకు సమయం ఇచ్చింది. ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత, జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 16 లక్షల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 6.99 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన ఎన్నికల సంఘం ఈ నెల నాలుగున తుది జాబితాను ప్రకటించనుంది. ఇందులో తమ ఓటు ఉండో లేదో పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. ఒకవేళ తొలగిస్తే 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు పురోగతిలో ఉంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ముసాయిదా జాబితా ఓట్లలో బోగస్​ ఓట్లను ఏ మేరకు తొలిగించారోననే ఆందోళన ప్రధాన పార్టీల్లో వ్యక్తమవుతోంది. 

స్ధానికేతరులకూ ఓట్లు

పొట్టకూటి కోసం తెలంగాణకు వలస వచ్చిన స్ధానికేతరులూ రాష్ట్రంలో సగానికి పైగా సెగ్మెంట్లలో ఓట్లు కలిగి ఉండడం గమనార్హం. ప్రతిసారి ఎన్నికల్లో సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వలసదారులు తెలంగాణలోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులపై ఒత్తిడి, ప్రలోభాలకు గురి చేస్తున్న రాజకీయ నేతలు ఓటర్ల జాబితాలో దొంగ ఓటర్లను నమోదు చేయించుకుంటూ ఎన్నికల్లో వారి ఓటు తమకే పడేలా చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా ఉపాధి, వ్యాపారం, చదువు కోసం విశ్వనగరంగా పేరొందిన హైదరాబాదుకు వస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న నాయకులు తమ తమ డివిజన్లలో ఓటర్ల జాబితాలో వారి పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్​ గఢ్, రాజస్థాన్, గుజరాత్, ఏపీ నుండి చాలా మంది ఇక్కడ స్థిరనివాసమేర్పర్చుకుని జీవనం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల్లో వలసదారుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించుకున్న అధికార బీఆర్ఎస్ పార్టీ వారి ఓట్లతో గెలిచిందని బీజేపీ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాల్లోనూ ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారూ తమ సొంత రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు.

రాష్ట్రంలో 3.06 కోట్ల ఓటర్లు

ఎన్నికల సంఘం ప్రకటించిన ముసాయిదా జాబితాలో 3.06 కోట్లు మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో సగానికి పైగా నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6,62,552 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా భద్రాచలంలో 1,44,170 మంది ఉన్నారు. జిల్లాలవారీగా చూస్తే హైదరాబాదులో 43,01,401 మంది ఉండగా, అతి తక్కువగా ములుగు జిల్లాలో 2,12,278 మంది ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓటర్ల సంఖ్య కోటికి పైగా ఉంది. మొత్తం ఓటర్లలో మూడొ వంతు వరకు ఈ మూడు జిల్లాల్లోనే ఉండడం విశేషం. ఇదీలావుంటే, ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థులు నిర్వహించిన ప్రైవేట్​ సర్వేల్లో తొమ్మది లక్షలకు పైగా  బోగస్​ ఓట్లు బయటపడినట్లు సమాచారం. బోగస్ ఓట్లను తొలిగించాలంటూ అన్ని పార్టీలు జిల్లా, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

అమలుకు నోచుకోని ఈసీ నిబంధనలు

బోగస్‌ ఓట్ల నమోదు, అర్హుల తొలగింపు కార్యక్రమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. స్థానికంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి, వారి మీద ప్రేమతో పలువురు ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అక్రమాలతో దొంగ ఐడీలున్న వారిని సదరు నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వాప్తవంగా, ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదును స్వీకరించి పోలింగు బూతులో ఓటర్ల నమోదు జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ చేసి, ఒకే డోర్‌ నంబర్‌లో నివసించే ఓట్లను ఒకే సీరియల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త ఓట్లు నమోదు చేసినా, పాతవి తొలగించినా జాబితాలు తప్పనిసరిగా ఈఆర్వో, ఏఈఆర్వో ఆఫీస్‌ బోర్డులోను, వెబ్‌సైట్‌లోనూ ప్రదర్శించాలి. ఓటరు జాబితాలో డోర్‌ నంబర్లు సరిగా ఉన్నాయో లేవో సరిచూడాలి. ఒకే డోర్‌ నంబర్‌లో అనేక మంది ఓటర్లు నమోదైతే, వాస్తవికతను ధ్రువీకరించి బోగస్‌ ఓట్లను తొలగించాలి. చనిపోయిన వారి ఓట్లను క్రమం తప్పకుండా తొలగించాలి. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను ప్రస్తావించిన ఫిర్యాదుదారుడికి ఈసీ తీసుకున్న చర్యను, తగిన సమాచారాన్ని ప్రత్యుత్తరంగా అందించాలి. వలస వచ్చిన, వెళ్లిన ఓటర్ల నమోదు, తొలగింపుల విషయంలో రాతపూర్వక ఆదేశాలు ఇవ్వాలి. ఓటర్‌-–ఆధార్‌ లింకేజీ పరంగా మెరుగైన శాతం నమోదు కాలేదని ఆధార్‌ లింక్‌ లేని ఓట్లను తొలగించడం సరికాదు. అలాంటి ఓట్లను తొలగించే బదులు, ఆధార్‌ లింక్‌ చేయడానికి ప్రయత్నించాలి. కానీ అనేక సెగ్మెంట్లలో ఎన్నికల సంఘం ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. 

నేడు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం

ఈ యేడాది డిసెంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారుల బృందం నేడు రాష్ట్రానికి రానుంది. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్న బృందం ఎన్నికల సన్నద్ధత, సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించనుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వీల్ చైర్లు, ఇంటిగ్రేటెడ్ బోర్డర్ చెక్-పోస్టులకు సంబంధించిన వివరాలతో సమీక్షలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లతో గెలిచినట్లు ప్రత్యర్థ అభ్యర్థులు హైకోర్టు, ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించడం, అందిన ఫిర్యాదులపై కోర్టులూ సంబంధిత ఎన్నికల అధికారులకు మొట్టికాయలు వేయడం ఇటీవల రాజకీయాలను హీటెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా.. వివాదస్పదమవుతోన్న బోగస్​ ఓట్ల అంశం వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సమస్యను తెచ్చిపెడుతుందోననే అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే అందిన ఫిర్యాదుల మీద పారదర్శక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.