పెద్ద జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం

పెద్ద జయంతి ఉత్సవాలకు సర్వం సిద్ధం
  •  కొండగట్టులో నేటి నుంచి  ఉత్సవాలు...
  •  2 లక్షల వరకు భక్తుల రాక...
  •  పట్టు వస్త్రాలు, తలoబ్రాలు సమర్పించనున్న వినోద్ కుమార్, సంతోష్ కుమార్, రవిశంకర్ లు...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం  పెద్ద జయంతికి ముస్తాబయింది. నేటి నుంచి జరగనున్న పెద్ద జయంతి ( బ్రహ్మోత్సవాలు)  ఉత్సవాలకు సర్వం ఏర్పాట్లు సిద్దo చేశారు. అయితే ఈ నెల 14 వరకు కొనసాగనున్న ఉత్సవాల సందర్బంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు, దీక్ష పరులు తరలిరానున్నట్లు, ఉత్సవాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు. కాగా, శుక్రవారం నుంచి ఆలయంలో స్వామివారి అర్జీత సేవలు నాలుగు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు, ఆలయం ముందు గల యాగశాలలో ఉత్సవాలు వైభవంగా కొనసాగించనున్నట్లు ఈవో  పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు.. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

 జయంతి సందర్బంగా.. మొదటి రోజు...
పెద్ద జయంతి ( బ్రహ్మోత్సవాలు) సందర్భంగా ఆలయ అర్చకులు గురువారం సాయంత్రం యాగశాల శుద్ధి, పుణ్యాహవచనం, అంకురారోపణ, అఖండ దీపా స్థాపన, తదితర కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభించారు. కాగా, శుక్రవారం ఉదయo 9 గంటల నుంచి మధ్యాహ్నo వరకు  స్వస్తివాచనం, రక్షాబంధనం, దేవతాహ్వానం, యాగశాల ప్రవేశం, స్థాపిత దేవతార్చన, అగ్ని ప్రతిష్ట, అభిషేకాలు, సహస్రనామార్చన పారాయణం, నైవేద్యం, తీర్థ ప్రసాద వితరణ.. సాయంత్రం 5 గంటల నుంచి విష్ణు సహస్ర పారాయణం, హోమం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, మంత్రపుష్పం తదితరుల కార్యక్రమాలు నిర్వహిoచనున్నారు.

 జిల్లా కలెక్టర్ స్పెషల్ ఇంట్రస్ట్...
కొండగట్టులో నిర్వహించే పెద్ద జయంతి (బ్రహ్మోత్సవాలు) ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ  స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించి విజయవంతం చేసిన సందర్భంగా... కొండగట్టులో  ఉత్సవాలను అదే మాదిరిగా విజయవంతం చేసేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి లక్షల్లో భక్తులు రానున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా, అలాగే భక్తుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేపట్టడానికి ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇలా ఉండగా, గురువారం జిల్లా స్థాయిలోని అధికారులు ఏర్పాట్లపై ఆలయ ఈవో, అధికారులతో మరోమారు సమీక్షా నిర్వహించారు. ఆయా అధికారులకు వారి వారి బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గిన సహించేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కొండగట్టుపై ప్రత్యేక దృష్టి పెట్టినందున ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

 ఏర్పాట్లు ఇవి...
పెద్ద జయంతి ఉత్సవాల సందర్బంగా స్వామి ఆలయంను విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు అక్కడక్కడా పెద్ద ఎల్ఈడీ టీవీలు, కొండపైన, కొండ కింద స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో తయారు చేసిన వివిధ దేవతల కటౌట్లు ఏర్పాటు చేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా స్టేజిలు ఏర్పాటు చేశారు. భక్తులు కొండపైకి చేరుకోగానే సులభంగా ఆయా ప్రదేశాలకు వెళ్లి మొక్కులు తీర్చుకోవడం కోసం రూట్ మ్యాప్స్, పలు చోట్ల చలివెంద్రాలు, పార్కింగ్ కోసం స్థలాలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా వివిధ మొబైల్ సెల్ టవర్స్ కూడా అందుబాటులో ఉంచారు. కాగా, ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ఆలయాల నుంచి దాదాపు 60 మంది ఉద్యోగులు డిప్యూటేషన్ పై వస్తున్నట్లు ఏఈవో బుద్ది శ్రీనివాస్ తెలిపారు. శానిటేషన్ కోసం మ్యాన్ పవర్ పెంచినట్లు, పలు చోట్ల ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా మరుగుదొడ్లు నిర్మించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే భద్రత పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జిల్లా ఎస్పీ భాస్కర్ చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా కాలినడకన వచ్చే స్వాములకు  పలు సూచనలు ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.

 భద్రాచలం నుంచి తలoబ్రాలు...
పెద్దజయంతి (బ్రహ్మోత్సవాలు) ఉత్సవాల సందర్బంగా... కొండగట్టుకు భద్రాచలం నుంచి తలoబ్రాలు, పట్టు వస్త్రాలు రానున్నట్లు ఆలయ ప్రధానార్చకులు జితేందర్ స్వామి, ఉప ప్రధానార్చకులు చిరంజీవి తెలిపారు. శుక్రవారం ఉదయం కార్యక్రమం ముందు వాటిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు  అందజేస్తారని వారు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.