ఊరు విడిచి వెళ్లండి

ఊరు విడిచి వెళ్లండి
  • 60 కుటుంబాలకు సర్పంచ్ భర్త ఆదేశం  
  • ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు 
  • విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నాలుగున్నర దశాబ్దాల క్రితం వలస వచ్చి, కాయకష్టం చేసుకుని, ఇండ్లు కట్టుకుని బతుకున్న తమను ఊరు విడిచి వెళ్లిపొమ్మని ఓ సర్పంచ్​భర్త  వేధిస్తున్నాడని వాపోతున్నారు ఆ కార్మికులు. దిక్కుతోచని స్థితిలో సోమవారం కలెక్టర్ ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. న్యాయం చేయమని వేడుకున్నారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర నుంచి, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చాకలి, ఆదివాసీ, బీసీ కులాలకు చెందిన దాదాపు 70 కుటుంబాలవారు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి 45 యేండ్ల క్రితం   వలస వచ్చారు. కొందరు కులవృత్తులు చేసుకుంటూ,  కొందరు కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నారు. కాయకష్టం చేసి అక్కడే కొంత భూమిని కొనుక్కొని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని పిల్లలను చదివించుకుంటున్నారు. వీరంతా కలిసి 360 మంది ఉంటారు.  వీరిని నెల రోజులుగా సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం ఊరు విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నాడు. వలస వచ్చినవారు ఊరిలో ఉండడానికి వీల్లేదని ఆస్తులు అమ్ముకుని తక్షణమే ఊరు ఖాళీ చేయాలని గదమాయిస్తున్నాడు. ఏ చిన్న పని పడినా  ఆధార్ కార్డు ఇస్తేనే చేస్తాననంటూ, ఆధార్ కార్డు లాక్కొని వాటిని డిలీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. శివరాత్రి ముత్తయ్య అనే వృద్ధుడు మరణిస్తే, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్లనిస్తానని  బెదిరించాడు. రత్నం మహేశ్ అనే ఆదివాసీ దివ్యాంగుడు పెళ్లి సంబంధం కుదుర్చుకోగా అడ్డుకున్నాడు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేసి, పోలీసుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. స్థానిక నాయకులకు, అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయనికి తరలి వచ్చి అదనపు కలెక్టర్ మంద మకరంద్ ను కలిసి తమ బాధను విన్నవించుకున్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Mudra EPaper News:

ఊరు విడిచి వెళ్ళండి

https://epaper.mudranews.in/c/71738165
https://epaper.mudranews.in/c/71740556