పకడ్బందీగా ఓటరు జాబితా

పకడ్బందీగా ఓటరు జాబితా

జనగామ కలెక్టర్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: ఓటరు జాబితాను పకడ్బందీగా తయారుచేయాలని జిల్లా కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లాలోని 21 మంది అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్లు, 21 అసిస్టెంట్ ఎలక్ట్రోల్ ఆఫీసర్లకు రెండో దశ ఓటరు జాబితా సవరణ, నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ నేడు శిక్షణ తీసుకున్న అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రేనర్స్ (ఏఎల్ఎంటీ)లు బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ సూపర్‌‌ వైజర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఓటరు జాబితా తయారు, సవరణలు ఏమైనా ఉంటే సరి చూడాలన్నారు. కచ్చితమైన ఆధారాలు సమాచారం ప్రకారం సవరణ చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, చనిపోయిన వారి వివరాలు మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా తొలగించాలని సూచించారు. గరుడ (బీఎల్ఓ) యాప్‌లో వివరాలు నమోదు ప్రక్రియ సరి చూసుకోవాలన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల సౌకర్యాలు తనిఖీ చేయాలని ఆదేశించారు. రివిజన్ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు ముఖ్యపాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, రోహిత్ సింగ్, ఎన్నికల పర్యవేక్షకుడు అలీ , డిప్యూటీ తహసీల్దార్‌ శంకర్, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. నులి పురుగుల నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ వాల్ పోస్టర్‌‌ను కలెక్టర్‌‌ శివలింగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 104 హెల్త్ సబ్ సెంటర్ల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, వోకేషనల్ కాలేజీలలో చదువుతున్న సుమారు 1,13,142 మంది విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 20న మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఆ రోజు అందని వారికి మరో దఫా 27వ తేదీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్ రవీందర్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ అశోక్ కుమార్, సీహెచ్ఓ జైపాల్ రెడ్డి, రవీందర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఏకే మన్సురి పాల్గొన్నారు.