వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా  ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా  ఏర్పాట్లు చేయాలి:  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టరేట్ లో ధర్మపురి నియోజకవర్గ  అధికారులతో త్రాగునీరు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికలతో నీటి సరఫరా అందిచే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  అవసరమైన బోరు బావులు అద్దెపై ఏర్పాట్లు, చేసుకోవాలని సూచించారు. మిషన్ భాగీరథ పైపులైన్ లీకేజిలను సవరించుకుంటూ ప్రతీ ఇంటికి నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని అన్నారు. బల్క్ నీటినీ ఆయా ట్యాంకులకు చేరే విధంగా ఏర్పాట్లు చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 78 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతున్నట్లు స్థానిక ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన సమస్యపై కలెక్టర్ స్పందించి ఆయా ప్రాంతాలలో త్రాగు నీటి సరఫరా జరిగే విధంగా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిడ్ మానేరు, ఎస్సారెస్పీల నుండి సరఫరా అయ్యే త్రాగునీటికి ఆయా సోర్స్ లలో నీటి సామర్థ్యాన్ని మెయింటేన్ చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వచ్చే వేసవి కాలం నాటికి కావలసిన నీటినీ లెక్కిస్తూ సోర్స్  సామర్థ్యాన్ని నిల్వ చేయాలని అన్నారు. 


అనంతరం వైద్య ఆరోగ్యం పై సమీక్షిస్తూ ధర్మపురి కమ్యూనిటి ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. 30 పడకలు గల ఆసుపత్రిలో 12 మంది డాక్టర్లు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారని, ఇంకా సివిల్ పనులు నిర్వహిస్తున్నట్లు, అవసరమియన్ ఎక్విప్ మెంట్ కోసం కమీషనర్ కార్యాలయంకు లేఖలు రాయడం జరిగిందని జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యురాలు సుదీక్షణ వివరించగా, ఎక్విప్ మెంట్ సంబంధించిన లేఖలు తమకు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.  50 పడకలు గల మాతా శిశు ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, బిల్లులు చెల్లింపులు కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కొత్తగా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తీ చేయాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా నిర్మాణ పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులకు కావలసిన ఎక్విప్ మెంట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, పల్లె దవాఖాన, బస్తీ దవాఖానకు కావాల్సిన పరికరాలు, ప్రహరి గోడ నిర్మాణ పనులకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని, ఇప్పటికే మంజూరైన పనులను ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రారంభించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎం.పి.డి.ఓ.లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.