స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు
  • సమీక్షించిన జిల్లా కలెక్టర్ హరీష్       

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీశ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొంగరకలాన్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో వి.ఐ.పిలు, అధికారులు, మీడియా, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. త్రాగునీరు,పారిశుధ్య ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్య అతిధి సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని అన్నారు. వేడుకలకు వచ్చే అతిథికి పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వేదికను అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఈ.ఓ.ను ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ ప్రమీల రాణి, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ. దీలిప్ కుమార్, జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.