కేసీఆర్‌‌.. జనగామకు వచ్చే హక్కులేదు

కేసీఆర్‌‌.. జనగామకు వచ్చే హక్కులేదు
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ నమ్మకాన్ని వమ్ము చేసిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంలో అడుగు పెట్టే నైతక హక్కులేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి మండిపడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జనగామ ప్రజలు బీఆర్ఎస్ను నమ్మి కేసీఆర్కు పట్టం కట్టారని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. ఆకాల వర్షాలు, వడగల్ల వానకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నా పట్టించుకోలేదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతు రోడ్డుపై ధర్నా చేస్తే ఈ చేతకాని ప్రభుత్యం కమిటీలు వేసి రూ.10 వేల నష్టపరిహారం ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా చేతులు దులుపుకుందని ఆరోపించారు.   రైతులను మోసం చేసిన కేసీఆర్ వారికి క్షమాపణ చెప్పుకొని ఈ గడ్డపై అడుగు పట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. జనగామ పట్టణ ప్రజలు తాగునీటి సమస్యతో బాధ పడుతుంటే గత ఎలక్షన్ల ముందు మూడు నెలలో ఈ సమస్యపై పరిష్కారం చూపతానని హామీ ఇచ్చిన సీఎం ఇప్పటి వరకు తీర్చలేదన్నారు. జనగామ ప్రాంతానికి నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ప్రకటించి మాట నిలబెట్టుకోలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లేగ రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉడుగుల రమేశ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌడ రమేశ్, శివరాజ్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ హరిశ్చంద్ర గుప్తా, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహిపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.