ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తాం: వైఎస్సార్‌‌ టీపీ కోఆర్డినేటర్‌‌ వెంకట్‌రెడ్డి

ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తాం: వైఎస్సార్‌‌ టీపీ కోఆర్డినేటర్‌‌ వెంకట్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌‌ టీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ కోర్డినేటర్‌‌ ఇందుర్తి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పార్టీ నియోజకవర్గ కోర్డినేటర్‌ బాధ్యలు స్వీకరించిన ఆయన జనగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు మనేగాల్ల మంజుల, పట్టణ అధ్యక్షుడు గుగ్గిళ్ల శ్రీధర్‌తో కలిసి మాట్లాడారు. పాలకులు గ్యాస్‌ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్‌ ధరల పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కేంద్రం రేటు పెంచిందని బీఆర్‌‌ఎస్‌ లీడర్లు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.

గ్యాస్ సిలిండర్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.300 ట్యాక్స్‌ వేస్తుందన్నారు. ఒక వేళ కేంద్రం పెంచితే రాష్ట్రం ట్యాక్స్‌ అయినా తగ్గించాలని డిమాండ్‌ చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌‌రెడ్డి హయాంలో కేంద్రం రేటు పెంచితే రాష్ట్రం నుంచి రూ.50 సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, తన నియామకానికి సహకరించిన వైఎస్సార్‌‌ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల, అధికార ప్రతినిధులు పిట్ట రాంరెడ్డి, గట్టు రామచంద్రరావు, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, గాడిపెల్లి కవిత, నీలం రమేశ్‌, ఉమ్మడి జిల్లా కోర్డినేటర్‌‌ బీరెల్లి శ్రీనివాస్‌రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు గౌరబోయిన సమ్మయ్యకు ఇతర లీడర్లు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం...
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న స్టూడెంట్ల ఆత్మహత్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేఎంసీ మెడికల్‌ విద్యార్థి ప్రీతి, శ్రీచైతన్య కాలేజీ ఇంటర్‌‌ విద్యార్థి సాత్విక్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. స్టూడెంట్ల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.