హత్యలు, అత్యాచారాల రాష్ట్రంగా తెలంగాణ

హత్యలు, అత్యాచారాల రాష్ట్రంగా తెలంగాణ

 బిజెపి నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : హత్యలు,అత్యాచారాల కేంద్రం గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని బిజెపి నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా.భోగ శ్రావణి అన్నారు. ర్యాగింగ్ కు గురై  ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.స్థానిక తాసిల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మాజీ మున్సిపల్ బోగ శ్రావణి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం హత్యలకు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,000 మంది మహిళలు హత్యలకు, అత్యాచారాలకు గురయ్యారని ఇందుకేన బంగారు తెలంగాణ సాధించింది అని ఆమె ప్రశ్నించారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళల ను కన్నెత్తి చూస్తే వాని కన్ను తీస్తానని మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళ పోలీస్ స్టేషన్ లు, మహిళా కమిషనరేట్లు, ఎక్కడికి పోయాయన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు మహిళా కమిషన్ను నియమించకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ నిధుల కింద రూ. 238 కోట్లు మంజూరు చేస్తే ఆ నిధులను మహిళల రక్షణ కోసం ఖర్చు పెట్టకుండా  దారి మళ్ళించారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తూ గౌరవంగా బ్రతకాల్సిన మహిళా ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీలోనే అవమానాలకు గురై కన్నీరు పెట్టుకుంటున్నా ఆ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదన్నారు.రాష్ట్రంలో ర్యాగింగ్ చట్టాలు ఏమయ్యాయని, ఇప్పటికైనా హోం మినిస్టర్ బయటకు వచ్చి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని సూచించారు. ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడాలని, లేనట్లయితే తెలంగాణ లోని ఆడవాళ్లంతా ఆది పరాశక్తులై ఎదురు తిరుగుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చింతకింది అనసూయ, జిల్లా అధ్యక్షురాలు సురతాని భాగ్యలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు సునంద, మాజీ  కౌన్సిలర్ అరవ లక్ష్మి, మమత, గంగా దేవత  మధురిమ, పుష్ప, లక్ష్మి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.