ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి బతుకులే

50 ఏండ్ల పాలనలో కరువు కాటకాలే
తెలంగాణ బతుకులను నాశనం చేశారు
కాంగ్రెస్‌పై విరుచుకుపడిన సీఎం కేసీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు రాగానే రాష్ట్రానికి ఎవరెవరో వస్తున్నారని, కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామంటోందని, ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. గత కాంగ్రెస్ పాలనపై దుమ్మెత్తిపోశారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చేసింది చాలక మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతున్నారని, ఇందిరమ్మ రాజ్యంలో ఏముండేనో తెలియదా అని అన్నారు.
ఎన్టీ రామారావు రెండు రూపాయలకు కిలోబియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు అని, తిండికి కూడా ఏడ్చామని, ఎవ్వడు ఆదుకున్నోడు లేడని విమర్శించారు. ఆనాడు వారికి పేదల కడుపు నింపాలన్న సోయి కూడా లేదని, రైతుల పొలాలకు నీరివ్వలేదని, ఏదీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏండ్ల కాంగ్రెస్ రాజ్యంలో ఎంత అన్యాయం జరిగిందో గుర్తు చేసుకోవాలని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమం చేస్తే, 14 ఏండ్లు కొట్లాడితే తెలంగాణ వచ్చిందని, ఈ 14 ఏండ్లళ్ల టీఆర్‌ఎస్ పార్టీని చీల్చడానికి ఎన్నో కుట్రలు చేశారని, ఎన్నో ఇబ్బందులు పెట్టారని వివరించారు. ఇందిరమ్మ రాజ్యమంటూ చెప్పేటోళ్లు అంతా ప్రజల బాగోగులు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
బతుకును నాశనం చేశారు
తెలంగాణను ఆగం పట్టించి బతుకును నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గతంలో జరిగిన అన్యాయాలన్నీ బీఆర్ఎస్ పాలనలో ఒకటి ఒకటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని, ఆర్డీఎస్‌పై తుమ్మిళ్ల ఎత్తిపోతల కట్టుకున్నామని, దాని ద్వారా 35వేల ఎకరాలకు నీరు వస్తుందని వివరించారు. తుంగభద్ర, కృష్ణా నదులు పక్కనే ఉన్నా 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నీళ్లు ఎందుకివ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే ధరణిని కూడా తీసివేసి బంగాళాఖాతంలో వేస్తామంటూ చెబుతున్నారని, ధరణిని తీసివేసి మళ్లీ పాత పద్ధతి తెస్తామంటున్నారని, ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి.. మల్లయ్యది పుల్లయ్యకు రాసి కోర్టుల చుట్టూ తిప్పుతారని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.