మహిళ సంక్షేమం పై సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ద

మహిళ సంక్షేమం పై సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ద
  • కడుపు పడ్డా బిడ్డ మొదలు పండు ముసలి వరకు కేసిఆర్ పథకాలు...
  • మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్.జి. రంజిత్ రెడ్డి

ముద్ర ప్రతినిది, హైదరాబాద్,రాజేంద్ర నగర్: మహిళ సంక్షేమం పై సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ద ఉందని, అందువల్లే అయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్ లోని జి అర్ కే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి, అనంతరం చిన్నారులచే ప్రదర్శించబడిన నాట్య ప్రదర్శన ను తిలకించారు.

ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, అక్కడ దేవతలు పూజించబడతారాన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల అమిత గౌరవం ఉందని, అందుకే మహిళ సంక్షేమం కోసం అయన తీవ్ర కృషి చేసి, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.

Also Read: ఏసీబీకి చిక్కిన వైద్య శాఖ ఉద్యోగులు

సమాజంలో మహిళలు లేక పోతే మనిషి జననం లేదు, మననం లేదు, గమనం లేదు, మనిషి జీవితానికే గమ్యం లేదన్నారు. ఒకనాడు మహిళ లకు రక్షణ ఉండేది కాదని, నేడు మహిళలు సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం షీ టీం లను తీసుకు వచ్చిందన్నారు. బిడ్డ కడుపు లో పడ్డ మొదలు నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

కేసిఆర్ కిట్ మొదలు ఒంటరి మహిళలకు పెన్షన్ లు,ఆసరా పెన్షన్ లతో ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళ సంక్షేమం పట్ల చాలా కమిట్ మెంట్ ఉందన్నారు. మహిళలు ఇంట్లో అన్ని బాధ్యతలు చూడటంతో పాటు పిల్లలకు వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పించాలన్నారు. చదువు పట్ల ఉన్న శ్రద్ధతో తన తల్లి తనను చదివించడంతో తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. తల్లితండ్రులకు తమ పిల్లలకు ఎక్కువ కంఫర్ట్స్ ఇవ్వకుండా, వారి సొంత కాళ్ళ పై నిలబడేలా తయారు చేయాలన్నారు.

స్థానిక సంస్థలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని, తన నియోజక వర్గాలలో ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు మహిళలే ఉన్నారని వివరించారు. రాష్ట్రంలోనే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు మహిళలు ఉండటం విశేషమన్నారు. మహిళ బిల్లు కోసం తమ పార్టీ తరపున ఎం ఎల్ సి కవిత ఢిల్లీలో పోరాటం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా మహిళ సంక్షేమం కోసం తాము అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని వివరించారు. అనంతరం పలువురు లబ్ది దారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.