పోరుకు సై అంటున్న సీపీఎస్ ఉద్యోగులు

పోరుకు సై అంటున్న సీపీఎస్ ఉద్యోగులు

పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్ కు సర్వం సిద్ధం.

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: ఒపీస్ సాధనే ఏకైక ఎజెండాగా ముందుకు. కొనసాగిన సన్నాహక సమావేశాలు. మేము సైతం అంటున్న అన్ని స్థాయిల ఉద్యోగులు ఉపాధ్యాయులు. మహిళా సీపీఎస్ ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే ఏకైక ఎజెండాతో. పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్  పేరుతో ఏప్రిల్ 16న జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం 9గంటల నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గద్వాలలో తలపెట్టిన ర్యాలీకి ఉద్యోగులు ఉపాధ్యాయులు సర్వసన్నద్ధమవుతున్నారు. నేడు గద్వాల జిల్లా కేంద్రంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు, జిల్లా ఇరిగేషన్ శాఖలోని అన్ని డివిజన్లలో ప్రచారం చేయడం జరిగింది.

2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడింది. నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగులు వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాత పెన్షన్ సాధించడం కోసం అనేక రూపాల్లో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. టీఎస్ సిపియస్ ఈయు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటాలు ఒకింత విజయవంతంగా ముందుకు వెళుతున్నాయి. ఈ సంఘం పోరాటాల ఫలితంగా ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారు.మరో రెండు రాష్ట్రాల్లో ఓపిఎస్ అమలుకు కావలసిన కార్యాచరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి డిమాండ్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం ఈ నెల 16న తలపెట్టిన పెన్షన్ కాన్స్టిట్యూషనల్ ర్యాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని టీఎస్ సిపిఎస్ఇయు జోగులాంబ గద్వాల్ జిల్లా శాఖ నిర్ణయించుకుంది.

విజయపథంలో సన్నాహక సమావేశాలు- రాష్ట్ర సహా అధ్యక్షుడు విష్ణు, 16న తలపెట్టిన ర్యాలీ విజయవంతంగా నిర్వహించడం కోసం టీఎస్ సిపిఎస్  ఈయు జిల్లా కార్యవర్గం గడచిన కొన్ని రోజులుగా నిర్విరామంగా కృషి సల్పుతోంది. జిల్లాలోని అనేక విభాగాల్లో ఉన్న సిపిఎస్ ఉద్యోగులను ఉపాధ్యాయులను కలుస్తూ ర్యాలీలో పాల్గొనాల్సిన ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఇప్పటి వరకు 20 డిపార్ట్మెంట్లకు సంబంధించిన  సిపిఎస్ ఉద్యోగులను కలిసి ర్యాలీ ఆవశ్యకతను, పాల్గొనాల్సిన బాధ్యతను టీఎస్ సిపిఎస్ఈయు రాష్ట్ర సహా అధ్యక్షుడు విష్ణు, జిల్లాఅధ్యక్షులు నాగరాజు  వివరించారు.

మేము సైతం
ఉద్యోగి భవిష్యత్తు ఆయిన పాత పెన్షన్ సాధించేందుకు మేము సైతం అంటూ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. గెజిటెడ్ అధికారి మొదలుకొని ప్యూన్ వరకు ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, మున్సిపల్, హెల్త్ , రెవిన్యూ అధికారులు పలు డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారనీ తెలిపారు.

భారీ సంఖ్యలో పాల్గొననున్న మహిళా ఉద్యోగులు
టీఎస్ సిపిఎస్ ఈయు తలపెట్టిన ఈ భారీ ర్యాలీ కార్యక్రమానికి జిల్లాలోని మహిళా ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరవ్వనున్నారనీ పాత పెన్షన్ సాధించటం కోసం జరిగే ఈ పోరాటంలో ముందు వరుసలో మేముంటాం అంటూ గద్వాల జిల్లా  మహిళా ఉద్యోగులు తమ పోరాటపటిిమను ప్రకటిస్తున్నారు. తమ హక్కు అయిన పెన్షన్ సాధించుకునేందుకు ఎంతవరకైనా పోరాటం సలిపేందుకు సిద్ధమని జిల్లా మహిళా కమిటీ సభ్యులు వెంకట నర్సమ్మ, దానమ్మ, సుధ రాణి, వెంకటలక్ష్మీ  స్పష్టం చేస్తున్నారు.

ఉద్యోగుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది: జిల్లా అధ్యక్షులు నాగరాజు
టీఎస్ సిపిఎస్ ఈయు ఆధ్వర్యంలో తలపెట్టిన పెన్షన్ కాన్స్టిట్యూషనల్  ర్యాలీలో పాల్గొనేందుకు గడిచిన కొన్ని రోజులుగా సన్నాహాక సమావేశాలు నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశాలకు హాజరవుతున్న ఉద్యోగుల నుంచి ప్రతిస్పందన అద్భుతంగా ఉందన్నారు. పాత పెన్షన్ సాధించాల్సిన ఆవశ్యకత, ఆకాంక్ష పై ఉద్యోగులు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ర్యాలీ నిర్వహించడం ద్వారా తమ ఆకాంక్షను ఆవేదనను ప్రభుత్వానికి సుస్పష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

నేటి సన్నాహక కార్యక్రమాల్లో గద్వాల్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటు ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా.స్రవంతి, సీసీ వెంకటేష్, రాష్ట్ర సాంకేతిక అధికారుల సంఘం రాష్ట్ర  అధ్యక్షులు వెంకట రాజ రెడ్డి, సుజాత, వెంకటేష్,  జిల్లా నాయకులు నాగరాజు, వన్నవాడ రమేష్, శ్యామ్ సుందర్, తిరుమల రెడ్డి, శ్రీనివాస్  తదితరులు  పాల్గొన్నారు.