బహుజనులు చైతన్యం కావాలి - గొంగళ్ల రంజిత్ కుమార్

బహుజనులు చైతన్యం కావాలి - గొంగళ్ల రంజిత్ కుమార్

15వ రోజుకు చేరిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర..

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : 15వ రోజు గొంగళ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగిన నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర శుక్రవారం ధరూర్ మండలంలోని అల్వాల్ పాడు, కె.టి.దొడ్డి మండలంలోని మైలగడ్డ, రంగాపురం, బస్వాపురం, వరకు పాదయాత్ర కొనసాగింది.  మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత గట్టు మండలంలోని తుమ్మలచెర్వు, నల్లగట్టు తాండ, వావిలకుంట తాండ, బింగిదొడ్డి తాండ, ఆలూరు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగింది. అలాగే నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్రలో భాగంగా ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామానికి విచ్చేసిన సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ కి గ్రామస్తులు, మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొని తిలకం దిద్ది హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలు రంజిత్ కుమార్ కు రాఖీ కట్టి పాదయాత్ర విజయవంతం కావాలని కోరారు.
రంగాపురం గ్రామ శివారులోని కూలీ రైతులతో కాసేపు గొంగళ్ల రంజిత్ కుమార్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


తుమ్మలచెర్వు, ఆలూరు. గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు పెద్ద ఎత్తున డోళ్ల దరువులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలూరు గ్రామస్తులు పునరావాస గ్రామమైనటువంటి తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఇప్పటిదాకా గుడి లేక, బొడ్రాయి లేక, వ్యవసాయ పొలాలకు దారి లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గొంగళ్ళ రంజిత్ కుమార్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ. ర్యాలంపాడు రిజర్వాయర్ కోసం తమ ఊరినీ, పొలాలను త్యాగం చేసినటువంటి ఆలూరు గ్రామస్తులకు ఆన్యాయం చేయడం తగదని అన్నారు. కేవలం నాయకులు తమ స్వార్ధ రాజకీయాల కోసం గ్రామాన్ని బలి చేస్తున్నారని అన్నారు.

ఈ నడిగడ్డ ప్రాంతంలో 70 సంవత్సరాల నుండి ఒక కుటుంబ పాలనలో నలిగిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలను చైతన్యం చేయడానికి గ్రామ గ్రామాన ప్రజలను ఐక్యమత్యం చేయడానికి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ముందుండి పోరాటం చేస్తామని అన్నారు. ఈ నడిగడ్డ ప్రాంతంలో విద్య, వైద్యం సంక్షేమ అభివృద్ధికై మా పోరాటం నిర్వహిస్తామని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా నడిగడ్డ ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభించినట్లు ఈ సందర్భంగా మాట్లాడారు. నాటి నుండి నేటి వరకు ఈ నడిగడ్డ ప్రాంతంలో రాబోయే రోజుల్లో గద్వాల కోటపై బహుజన జండా ఎగరాలంటే ఓటు అనే బలమైన ఆయుధంతో కుటుంబ పాలనకు బుద్ధి చెప్పి చరమగీతం పాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, రంగస్వామి, పరుషరాముడు, గట్టు మండల నాయకులు ఆలూరు వెంకట్రాములు, జమ్మన్న, రఘుపతి, నర్సింహులు, ధరూర్ మండల అధ్యక్షుడు నెట్టెంపాడు గోవిందు, ఉపాధ్యక్షుడు మునెప్ప, మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు, ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాజ్, కార్యదర్శి తిమ్మప్ప, కె.టి.మండల నాయకులు అంజి, భీమన్ గౌడ్, ఏసు, హనుమంతు రెడ్డి, రాము, దస్తగిరి గౌడ్, ఎల్లేష్, ఉపేంద్ర, రమేష్, గోపాల్, బాస్ అంజి, చిన్న రాముడు, లక్ష్మన్న, తిమ్మప్ప, ఆశన్న, నేతన్న, భూపతి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.