మాఫియాలకు కేరాఫ్ గంగుల

మాఫియాలకు కేరాఫ్ గంగుల
  • రాసలీలల మంత్రిని అసహ్యించుకుంటున్న మహిళలలు
    • గంగుల ప్రలోభాలకు లొంగిన ఎంఐఎం నాయకులు
    • కొత్తపల్లిలో డబ్బులు పంచుతూ దొరికిన బండి
    • బండి గంగుల మధ్య చీకటి ఒప్పందం
    • కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్

    ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ఇసుక, గ్రానైట్, గుట్కా, లిక్కర్ భూ మాఫియాలు మంత్రి గంగుల కమలాకర్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగుల కమలాకర్ పై నిప్పులు చెరిగారు. రాసలీలల మంత్రిగా కొనసాగుతున్న గంగులను చూసి మహిళలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. వక్ఫ్ బోర్డ్ భూములను ఖబ్జా చేసిన గంగుల కమలాకర్ కు ఓట్లు వేయడానికి మైనారిటీ ప్రజలు దూరంగా ఉన్నారని స్పష్టం చేశారు. తమ భూములను కబ్జా చేసిన గంగుల కమలాకర్ ను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఎంఐఎం నేతలు ఇప్పుడు ఎందుకు అతనికి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. గంగుల ప్రలోభాలకు తలోగ్గిన ఎంఐఎం నేతల విధానాలను ముస్లిం సమాజం ప్రశ్నించాలని కోరారు. పేద ప్రజలకు చెందిన కాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసే కమలాకర్ ను ఓడించాలన్నారు.

    విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ నియోజకవర్గ ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గంగుల అభివృద్ధి చేసి ఉంటే ఓటమి భయంతో డబ్బులు ఎందుకు పంచుతున్నట్టని ప్రశ్నించారు. మంత్రి గంగుల బండి సంజయ్ కు పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బండి సంజయ్ ని గెలిపించి బిజెపి పార్టీలోకి పోయి తిరిగి ఎంపీగా పోటీ చేసే ఆలోచనతో గంగుల ఉన్నట్లు ఆరోపించారు.

    భావోద్వేగానికి గురై కన్నీరు కార్చిన పురుమల్ల

    రైతుబిడ్డగా ఒక వార్డు మెంబర్ స్థాయి నుండి నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసే స్థాయికి ఎదిగిన నన్ను ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నా ఎదుగుదలను చూసి ఓర్వలేక కక్ష పూరితంగా కేసులు పెట్టి 72 రోజులపాటు జైల్లో ఉంచి భార్య పిల్లలకు దూరం చేశాడని గంగులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు కార్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలి పిలుపునిచ్చారు. గంగుల, అతని అనుచరుల వల్ల నష్టపోయి ప్రజల ముందుకు చెప్పుకోలేక బాధలు అనుభవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారని తెలిపారు. టికెట్ ఆలస్యంగా రావడం వల్ల సమయం తక్కువగా ఉండడం వల్లే నియోజకవర్గంలో ప్రతి గడపకు చేరలేకపోయాను. నా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి పౌరుడిని కలిశారని తెలిపారు. త్వరలోనే బండి సంజయ్, గంగుల కమలాకర్ బండారాలను, స్కాములను, రహస్య ఒప్పందాలను, వ్యాపారాలను బయటపెడతాం అని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్, డిసిసి ప్రధాన కార్యదర్శి ఎస్.కే. సిరాజ్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరీఫ్, నాయకులు పొన్నం మధు, తదితరులు పాల్గొన్నారు.