వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి.గోపి 

వర్షాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ బి.గోపి 

ముద్ర,హుజురాబాద్ :  భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి. గోపి అన్నారు.  గురువారం మండలంలోని  చెల్పూర్ గ్రామంలోని పెద్దచెరువు, జమ్మికుంట మండల కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ కాలనీ లను సిపి  సుబ్బారాయుడు, ఆర్డీఓ  హరి సింగ్, ఇతర అధికారులతో కలిసి  పరిశీలించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెల్పూర్ గ్రామంలో పెద్దచెరువు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో చెల్పూరు- జూపాక -కందుగుల గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోగా,  ఆ మార్గంగుండా ఎవరు ప్రయాణించకుండా చూడాలని తెలిపారు.  అనంతరం జమ్మికుంట మండల కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ కాలనీలో ఇళ్లలోకి వరదనీరు వెళ్లగా కాలనీ పరిసరాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను గురించి వాకబు చేశారు.  

రానున్న 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా  వెంటనే వారిని ఆయా ప్రాంతాల నుండి తరలించడానికి అవసరమైన సహాయక చర్యలతో అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.  ఇంకా పొంగిపొర్లడానికి సిద్ధంగా ఉన్న వాగులు, కాలువలు వద్ద ఎప్పటికప్పుడు నీటి సామర్థ్యాన్ని పరిశీలించాలని, నీటి ఉధృతికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గురించి తెలుసుకుంటు సంబంధించిన విషయాన్ని తెలియజేయాలన్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ      పోలీస్ అధికారులందరు వారిపరిధిలో సంబంధిత అధికారులతో సమన్వయ పరుచుకోవాలని,సహాయక చర్యలు అందించడానికి సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. రోడ్లపై నుండి వరద నీరు ప్రవహించే మార్గాలలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.  ఈ పర్యటనలో ఎసిపి జీవన్ రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చెల్పూర్ సర్పంచ్ మహేందర్, తహసీల్దార్లు కోమల్ రెడ్డి, రాజేశ్వరి, సిఐ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.