YS Sharmila Janatha Ride రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ

YS Sharmila Janatha Ride రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
YS Sharmila Janatha Ride
  • విపక్షాల పోరాటాలు అడ్డుకుంటున్న పోలీసులు
  • ప్రధాని, కేంద్ర హోంమంత్రితో పాటు సుప్రీం సీజేకు షర్మిల అప్పీల్​
  • నివాసం వద్ద ఉద్రిక్తత.. 
  • తోపులాట... కిందపడిపోయిన వైఎస్సార్టీపీ చీఫ్

ముద్ర తెలంగాణ బ్యూరో: తెలంగాణాలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఖూనీ చేస్తున్నదని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల పోరాటాన్ని పోలీసులచే అడ్డుకుంటున్నదని, ప్రధాని నరేంద్ర మోడీ,హోమ్ శాఖ మంత్రి అమిత్ షా,సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు వైఎస్ షర్మిల అప్పీల్ చేశారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో రోగుల బాధలు తెలుసుకునేందుకు షర్మిలను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆమె ఇంటివద్ద ఉద్రిక్తత కొనసాగింది. ఈ సందర్భంగా ఆమే మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రజాస్వామ్యం లేదని, ఇక్కడ ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలగాణ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై దృష్టి పెట్టండి అని ప్రధాని, కేంద్ర హోంమంత్రితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. కేసీఅర్ నియంత అని మరో సారి నిరూపణ అయ్యిందని ఆరోపించారు.  వైఎస్సార్ బిడ్డకు కేసీఅర్ భయపడుతున్నాడని, అందుకే నన్ను ఆపుతున్నాడని విమర్శించారు.

కేసీఆర్​ ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని అనుకున్నామని,  జనతా రైడ్ కి పిలుపు నిచ్చాం అని తెలిపారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలని  అనుకున్నామని తెలిపారు.ఉస్మానియా ఆసుపత్రికి  ఒక్క దాన్ని మాత్రమే వస్తనని, దమ్ముంటే నాకు అనుమతి ఇవ్వండి అని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వడం లేదని,  ప్రజల పక్షాన నిలబడితే హౌజ్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారని, నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడటం తప్పా..? అని ఆమె ప్రశ్నించారు.  కేసీఅర్ ఒక డిక్టేటర్​గా మారాడని ఆరోపించారు.  ఉస్మానియా ఆసుపత్రి వద్ద టవర్స్ కడతామని కేసీఅర్ హామీ ఇచ్చారని, ఏమయ్యిందని షర్మిల ప్రశ్నించారు. పేదలపై కేసీఆర్​కు ఏ మాత్రం ప్రేమ లేదని, ప్రేమ ఉంటే ఇప్పటికే రూ.200కోట్లతో పేదల ఆసుపత్రి అయిన ఉస్మానియాను నిర్మించేవారని ఆరోపించారు. 

 ఉద్రిక్తత...
 వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల  ఇంటి వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం  ఛలో ఉస్మానియా ఆస్పత్రి కి షర్మిల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో  ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం నగరంలోని లోటస్‌పాండ్‌లోని ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుతగిలారు. దీంతో పోలీసులతో వైఎస్సార్టీపీ చీఫ్ వాగ్వాదానికి దిగారు. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో షర్మిల కిందపడిపోయారు.