సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి

సంక్షేమ పథకాలతో పేదల అభివృద్ధి

ముద్ర,జఫర్‌గడ్ : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని బిఆర్ఎఫ్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని ఓగులాపూర్, మగ్ధుం తండా, తమ్మడ పల్లి( జి), తిమ్మాపూర్, హిమ్మత్ నగర్, సూరారం, తిగారం గ్రామాలలో బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయనకు గ్రామల ప్రజలు  డబ్బు చప్పులతో, కోలాట నృత్యాలతో స్వాగతం పలికి వీర తిలకం దిద్దారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నారని, అలాగే పెట్టుబడి సాయం, రైతు బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయన్నారు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో అమలు చేయని పథకాలు ఇక్కడ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఎక్కడ కరెంటు కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం రైతులు ధర్నా చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటి పార్టీ అధికారంలోకొస్తే తెలంగాణలో రైతులు కరెంట్ కష్టాలు మళ్ళీ వస్తాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే 9 ఏండ్లు వెనక్కి వెళ్ళవలసి వస్తుందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రజలు గ్రహించి మరోసారి నన్ను ఆశీర్వదించాలన్నారు. సమావేశంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పాల్గొన్నారు.