బిజెపిని గద్దె దింపడమే బిఆర్ఎస్  లక్ష్యం ... ఎమ్మెల్సీ కోటిరెడ్డి

బిజెపిని గద్దె దింపడమే బిఆర్ఎస్  లక్ష్యం ... ఎమ్మెల్సీ కోటిరెడ్డి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: దేశ ప్రజల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీని గద్దె దించడమే బిఆర్ఎస్ లక్ష్యమని ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇంచార్జ్ కోటిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కోటిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ 14 ఏళ్ల ఆవిశ్రాంత పోరాటంతో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కల్పనలో ముందున్న తెలంగాణ ప్రభుత్వం పై  కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది అన్నారు. పన్నుల రూపంలో వేల కోట్లు కేంద్రానికి చెల్లిస్తున్న రాష్ట్రానికి రావలసిన వాటా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి రైతుల్ని, సామాన్య ప్రజల నడ్డి విరిచిందన్నారు. రూ. 400 లు ఉన్న గ్యాస్ సిలిండర్ రూ. 1200 లకు చేర్చిందన్నారు.

రాష్ట్రం వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇస్తే బిజెపి ప్రభుత్వం మోటర్ల కు మీటర్ల ను పెట్టే కుట్ర చేసిందన్నారు. విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. తాగునీరు, సాగునీరు, ఉచిత విద్యుత్తు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, మిషన్ కాకతీయ లాంటి పథకాలను దేశంలోని పేద ప్రజలకు అందించేందుకు బిఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని గద్దధించేందుకు బిఆర్ఎస్ పార్టీ ని  గెలిపించాలని కార్యకర్తలకు ప్రతినిధులు సూచించారు. ఎమ్మెల్యే రాజయ్య  మాట్లాడుతూ గత నాయకులు చేసిన అభివృద్ధి జీరో అన్నారు.

రిజర్వాయర్లు, రైల్వే బ్రిడ్జి, పాలిటెక్నిక్, మోడల్ స్కూల్, కస్తూరిబా, డిగ్రీ కళాశాల ఏర్పాటు టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినవి అన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినట్టుగానే పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు మాచర్ల గణేష్, సర్పంచ్ తాటికొండ సురేష్, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, వరాల రమేష్, చందర్ రెడ్డి, యాదగిరి, చేవెళ్ల సంపత్, శ్రీధర్, ఆకుల కుమార్, రంగు రమేష్, బొమ్మిశెట్టి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.