మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం స్థల పరిశీలన

మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం స్థల పరిశీలన

ముద్ర ప్రతినిధి, జనగామ (పాలకుర్తి) : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్‌టైల్‌ పార్క్ కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం స్థల పరిశీలన చేశారు. ఇందుకోసం కొడకండడ్లలోని అంబేద్కర్ కాలనీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, అనంతరం రామవరం రోడ్డులో ఉన్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. టెక్స్‌ టైల్‌ పార్క్‌కు కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా, భవిష్యత్తు అవసరాల రీత్యా అంతకంటే ఎక్కువ స్థలాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ నగర్ ఎదురుగా ఉన్న 50 ఎకరాల స్థలాన్ని పార్క్ కి అప్పగిస్తే భవిష్యత్తులో విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. అలాగే రామవరం రోడ్డులోని పది ఎకరాల స్థలం, అదనంగా మరోచోట 18 ఎకరాల స్థలం కూడా ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. మినీ టెక్స్‌ టైల్‌  పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. వేలాది మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందన్నారు.  కార్యక్రమంలో జనగామ అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో కృష్ణవేణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.