ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే.. బీజేపీ కార్నర్‌‌ మీటింగ్‌

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే.. బీజేపీ కార్నర్‌‌ మీటింగ్‌

– సీఎం కేసీఆర్‌‌ ఓ మోసగాడు

– టోపీ పెట్టుకుని వచ్చి.. మనకు టోపీ పెడతడు

– బీజేపీ నాయకురాలు, సినీనటి జీవిత రాజశేఖర్

ముద్ర ప్రతినిధి, జనగామ : ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల పేరకు ‘ప్రజా గోస.. బీజేపీ భరోసా’ పేరుతో కార్నర్‌‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ నాయకురాలు, సినీనటి జీవిత రాజశేఖర్‌‌ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని గణేష్‌ స్ట్రీట్‌లో నిర్వహించిన సమావేశానికి మాజీ మున్సిపల్‌ చైర్‌‌పర్సన్‌, బీజేపీ ఫ్లోర్‌‌ లీడర్‌‌ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి అధ్యక్షత వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడంతో పాటు పేదవాడి సంక్షేమం కోసం కేంద్రం ఎంతో కృషి చేస్తోందరన్నారు.

కేసీఆర్‌‌ దృష్టంతా ప్రజల బలహీనతలపై ఉంటుందని, వాటిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌‌ ఒక్కడి వల్ల రాలేదని, 1200 మంది ఆత్మబలిదానాలతో స్వరాష్ట్రం వచ్చిందన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని.. కేసీఆర్‌ ఈసారి బీఆర్‌‌ఎస్‌ పేరుతో‌ టోపీ పెట్టుకుని వచ్చిన మనకు టోపీ పెడతాడని ఎద్దేవా చేశారు. మళ్లీ ఆయనను గెలిపించి మూడోసారి తప్పు చేయొద్దని ప్రజలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కనిపించే దేవుడని, భారతదేశాన్ని ప్రపంచంలో తల ఎత్తుకొనేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఇందుకోసం గూగూల్ లో చూడండి అని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, నియోజకవర్గ నేత బల్ల శ్రీనివాస్‌, పట్టణ అధ్యక్షుడు పవన్‌ శర్మ, కౌన్సిలర్‌‌ బొట్ల శ్రీనివాస్‌, భువనగిరి పార్లమెంట్‌ కోకన్వీనర్‌‌ కొంత శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

సందడి చేసిన జీవిత..

బీజేపీ మీటింగ్‌కు వచ్చిన నటి జీవిత రాజశేఖర్‌‌ ప్రసంగం స్థానికులను అకట్టుకుంది. ప్రత్యేకంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ఇంటి పని, వంట పనేకాదు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను కూడా ఎక్కడ ఉన్నా ఇంటి గురించి ఆలోచిస్తానని, ఇది మహిళల సహజ గుణమన్నారు. మహిళలు ఇంటిని ఎలా చక్కదిద్దుతామో.. సమాజాన్ని కూడా చక్కదిద్దాలన్నారు. ఇందుకు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తప్పుచేసిన వారిని నిలదీయాలని సూచించారు. సమావేశం అనంతరం జీవితా రాజశేఖర్‌‌తో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు.