వికలాంగులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

వికలాంగులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: దివ్యాంగులు చదువుతోపాటు   క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియం బుధవారం అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా క్రీడ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని సూచించారు. నేటి ఓటమి రేపటి గెలుపుకు దోహదపడుతుందని తెలిపారు.

క్రీడా పోటీలకు జిల్లా నుంచి దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరు కావడం అభినందనీయమన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. సమాజంలో ఉన్నతమైన వ్యక్తులుగా దివ్యాంగులు నిలవాలని ఆకాంక్షించారు. పట్టుదల ఉంటే తమలక్ష్యాలను నెరవేర్చుకోవచ్చునని తెలిపారు. వీల్ చైర్  పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ అధికారి బావయ్య, ఐకెపి డిపిఎం రమేష్ బాబు, ఐ సి డి ఎస్ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.