అదాని, మోడీ అనుబంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు..

అదాని, మోడీ అనుబంధాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు..
  • పార్లమెంటులో ప్రజల గొంతుకగా ఉన్న రాహుల్ గాంధీకి ప్రజలు అండగా నిలవాలి..
  • ఓబీసీల గురించి మాట్లాడి నైతిక హక్కు బిజెపికి లేదు..
  • విలేకరుల సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అదాని, మోడీ అనుబంధాన్ని ప్రశ్నించినందుకే కక్ష పూరితంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారని, పార్లమెంటులో ప్రజల గొంతుకగా ఉన్న రాహుల్ గాంధీకి ప్రజలు అండగా నిలవాలని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పోదెం వీరయ్య పాల్గొని మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కుటుంబానికి వారసుడైన రాహుల్ గాంధీని పార్లమెంటులో ప్రశ్నించకుండా అనర్హత వేటు వేశారని కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. భారతదేశ సమగ్రతను కాపాడేందుకు ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భారత జాతిని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జో డో యాత్ర చేపట్టారని, అదాని, మోడీ అనుబంధంపై పార్లమెంటులో ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై వేటు వేయడాన్ని ప్రజాస్వామ్యవాధులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.
శిక్షలకు, బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన నిలబడి తన గొంతు విప్పుతానని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు చెప్పారు. ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో మోడీలకు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు.

మోడీ ప్రధాని కాకముందు అదానీ ఆస్తులు 23 వేల కోట్లు ఉన్నాయని, నేడు అవి 19 లక్షల కోట్లకు చేరడం నిజం కాదా అని ప్రశ్నించారు. పరువు నష్టం కేసులో అత్యధికంగా ఉన్న రెండు సంవత్సరాల శిక్ష  రాహుల్ గాంధీ పై వేయడంతో దేశం విస్తుపోతుందని తెలిపారు. తన పరువులకు హక్కులకు భంగం కలిగిన వ్యక్తులు ఫిర్యాదు చేయాల్సి ఉండగా మూడో వ్యక్తి ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వానికి నిజాయితీ లేదు.ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, బొగ్గు గనులు అన్ని అధానికి అప్పజెప్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో నిరుద్యోగుల పక్షాన బలహీనవర్గాల పక్షాన మాట్లాడే వారు ఉండకూడదని కుట్రపూరితంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేశారు అని ద్వజమెత్తారు. ప్రశ్నించే వారిపై ఈడి, సిబిఐల తో దాడులు చేయిస్తూ లొంగదీసుకుంటున్నారని విమర్శించారు. ఓ బీ సీ లకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తే కమండలం యాత్ర పేరిట బీజేపీ నాయకులు అడ్డుకున్నారని గుర్తు చేశారు.కాంగ్రెస్ పాలనలో 178 పబ్లిక్ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే మోడీ పాలనలో అన్ని ప్రైవేటీకరణ చేశారని విమర్శించారు. దీంతో నిరుపేదలకు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందకుండా పోతున్నాయన్నారు.

రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్షణ విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం రాహుల్ గాంధీ పై 24 గంటల్లోపే అనర్హత వేయడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్,  పీసీసీ సభ్యులు చల్లూరి మధు, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దండు రమేష్, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ పోరిక సమ్మయ్య, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ దూడపాక శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భువనసుందర్, జడ్పీ ప్లోర్ లీడర్ లింగమల్ల శారద, జిల్లా నాయకులు మహేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బుర్ర కొమురయ్య, కంచర్ల సదానందం, పొనకంటి శ్రీనివాస్, చుంచుల మహేష్, బుర్ర రజినీకాంత్, పిప్పాల రాజేందర్, అంబాల శ్రీను, నగునూరి రజినీకాంత్, అప్పాల శ్రీనివాస్ యాదవ్, రాజేష్, మహేందర్, కరుణాకర్ రావు, సతీష్, రంజిత్ లు పాల్గొన్నారు.