భూపాలపల్లి జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు: రంగులు చల్లుకుని డ్యాన్సులు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ..

భూపాలపల్లి జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబురాలు: రంగులు చల్లుకుని డ్యాన్సులు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డిలు ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. తోటి వారితో కలిసి డ్యాన్సులు చేసి, ఆనందోత్సహాలను పంచుకున్నారు. రంగుల పండుగ రావడంతో ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. చిన్నాపెద్దా తేడా తెలియకుండా రంగులతో ఆడుకున్నారు. రంగుల మయంతో ప్రతి ఊరూ-వాడా కళకళలాడిపోయింది. జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి.

రంగుల ప్రపంచంలో ప్రజలు తేలియాడారు. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడిపారు. సోమవారం రాత్రి కామదహనంతో ప్రారంభమైన వేడుకలు.. మంగళవారం ఊరూరా ఉత్సాహంగా సాగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, మహిళలు, చిన్నాపెద్దా కలిసి ఆడిపాడుతూ.. రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. రంగు రంగుల రంగేలీని ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సహజ సిద్ధమైన రంగులు పూసుకుంటూ హోలీ ఘనంగా జరుపుకున్నారు.

Watch Video Here: https://www.youtube.com/watch?v=M3u6eN7Fe9Y