అధైర్యపడకండి -అండగా ఉంటా

అధైర్యపడకండి -అండగా ఉంటా

– ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్
– నీట మునిగిన కాలనీల్లో పర్యటన
–  బాధితులకు  ఆహార పదార్థాలు అందజేత 

ముద్ర ప్రతినిధి, వరంగల్​:  రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నీటమునిగిన ప్రాంతాల్లో  ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ పర్యటించారు. అధైర్యపడకండని, అండగా ఉంటా అని వినయ భాస్కర్ అన్నారు. హనుమకొండ నగరంలోని రాంనగర్, రాజాజీ నగర్, నాయీంనగర్, పెద్దమ్మ గడ్డ, అలంకార్, రామన్నపేట,  హంటర్ రోడ్ వద్ద నీట మునిగిన కాలనీల్లో పర్యటించారు. ముంపు బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
 సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా-
నగరంలోని పలు కాలనీలు జలమయం కావడంతో సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే  వినయ భాస్కర్, కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పాల్గొన్నారు. నీట మునిగిన ప్రజలను డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సాయంతో బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి నేరుగా వారి ఇంటి వద్దకే ఆహార పదార్థాలు  ప్రత్యేకంగా అందజేశారు.

అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ... ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ శ్రేణులకు సైతం సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించారు. ఆయా పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి బాధితులకు ఆహార పదార్థాలను స్వయంగా అందజేశారు.

ఈ క్రమంలో ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యలు, సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షం కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా  కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన 18004251980, 9701999645 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.ఆయన వెంట కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.