50వేల 253 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మందుల సామెల్

50వేల 253 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన మందుల సామెల్
  • తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలోనే భారీ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్
  • అధికార పార్టీ అభ్యర్థిని ఒంటి చేత్తో మట్టి కరిపించిన సామెల్
  • 15 సంవత్సరాల తర్వాత తుంగతుర్తి కిల్లా పై రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా
  • సామెల్ గెలుపు తో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
  • నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు
  • మండల కేంద్రాల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు
  • తుంగతుర్తి ఎమ్మెల్యేగా మందుల సామెల్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా ఉన్న నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిట్టచివరి నిమిషంలో టికెట్ సాధించిన మందుల సామెల్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపింది. తుంగతుర్తి నియోజకవర్గం ధర్మారం గ్రామానికి చెందిన మందుల సామిల్ తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన గడపగడపకు తిరిగి ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మండల హామీలను పక్కనపెట్టి ఉద్యమ నేపథ్యంలో వచ్చిన గాదరి కిషోర్ కుమార్ కు రెండుసార్లు టికెట్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సామెల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో సర్వేలో సామేలుకు ప్రజాబళాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సామెల్కు టికెట్ ఇవ్వడంతో నామినేషన్ వేయడానికి వచ్చిన రోజు స్వచ్ఛందంగా వచ్చిన వేలాది మంది ప్రజానీకాన్ని చూసి నాడే కాంగ్రెస్ గెలుపు ఖాయమని రాజకీయ మేధావులు పరిగణించారు. సామెల్కు ఉద్యమ నేపథ్యం, సామాజికత ,కాంగ్రెస్ పార్టీ అండ మూడు కలియడంతో అఖండ మెజార్టీతో నియోజకవర్గంలో ప్రత్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మట్టికరించారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని తన వద్ద డబ్బులు లేకున్నా ప్రజల అభిమానం ఉందని ఎలుగెత్తి చెప్పిన సామేలు మాటలు ప్రజలు వమ్ము చేయకుండా అఖండ మెజార్టీతో గెలిపించారు.

నియోజకవర్గ ప్రజానీకం ఒకే ఒక్క నిర్ణయంతో ఓట్లు వేసినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, అధికార పార్టీ అభ్యర్థి పై ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఓట్ల రూపంలో ప్రదర్శించారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మండలాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కూడా అధికార పార్టీ ఘోర పరాయానికి కారణంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో ఏ ఎమ్మెల్యే సాధించని అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా, శక్తిగా మందుల సామేలు ఘనతకి ఎక్కారు. సామెల్ మంచితనం ప్రజలతో ఉన్న అనుబంధమే నేడు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా చేసిందని యావత్ ప్రజానీకం రాజకీయ పండితులు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. సామెల్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊరటనిచ్చింది. గత 15 సంవత్సరాలుగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. కానీ మందుల సామేలు అభ్యర్థిగా ప్రకటించిన నాడే కాంగ్రెస్ పార్టీ జెండా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాన రెపరెపలాడింది. అదే ఊపు ఓట్ల వరకు కొనసాగి గెలుపు రూపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉన్న ప్రేమ అభిమానాలను భారీ మెజార్టీతో చూపించడం జరిగింది. సామెల్ గెల్పొందడం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఊరటం ఇచ్చింది. ముఖ్యంగా సామేలుకు వెన్ను దన్నుగా నిలిచిన కోమటిరెడ్డి బ్రదర్స్ మార్క్ రాజకీయం తుంగతుర్తి నియోజకవర్గంలో బాగా పని చేసిందని చెప్పవచ్చు. సామెల్కు అన్ని రకాల అండగా నిలిచిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ విజయాన్ని తమ విజయంగా భావించవచ్చు. సామెల్ విజయంతో 9 మండలాల్లో విజయోత్సవాలు ఊపందుకున్నాయి. ప్రతి మండల కేంద్రంలో భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు .గ్రామ గ్రామాన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. తుంగతుర్తిలో విజయం సాధించడమే కాక రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు 15 సంవత్సరాలుగా దూరమైన అధికారం నేడు చేతికి రావడంతో ఎంతో ఊరటం ఇచ్చింది అని చెప్పవచ్చు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింతగా చేస్తూ ముందుకు సాగుతుందని భావిద్దాం.