ఎట్టకేలకు రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ అందజేత

ఎట్టకేలకు రామగోపాల్‌రెడ్డికి డిక్లరేషన్‌ అందజేత

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు.  ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్‌ ఫారం అందజేశారు.  ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించినా ఆయనకు ధ్రువీకరణ పత్రం అందించలేదు. దీనిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.  రామగోపాల్‌రెడ్డికి ధ్రువీకరణపత్రం అందించకపోవడంపై ఆగ్రహించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులు జేఎన్‌టీయూ గేటు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

జాయింట్​ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ కారును అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి,  పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌, కళ్యాణదుర్గం నియోజకవర్గ బాధ్యుడు ఉమామహేశ్వరనాయుడు తదితరులను అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసులే ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుంటే కాపాడేవారెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను అధికారులు ఉల్లఘించారని, దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్‌ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. ఈ పరిణామాల అనంతరం రామగోపాల్‌రెడ్డి కలెక్టర్‌ చేతుల మీదుగా ఎట్టకేలకు డిక్లరేషన్‌ ఫారం అందుకున్నారు.