రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం

రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం
  • గెలిస్తే పొంగేది లేదు ఓడితే కుంగేది లేదు
  • కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
  • మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ ముద్ర:రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని గెలిచినంత మాత్రాన పొంగిపోయి ఓడినంత మాత్రాన కృంగిపోయే స్వభావం తనకు లేదని పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మీ మధ్య ఉంటూ మీకోసమే పని చేస్తానని బీఆర్ఎస్ శ్రేణులకు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు .సోమవారం పట్టణంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తలకు భవిష్యత్తు ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల తీర్పును మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని రాబోయే రోజుల్లో మరింత కష్టపడి బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దగ్గర చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు.

బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడవద్దని తాను ఎక్కడికి వెళ్ళనని హుజూర్ నగర్ లోనే ఉంటానని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుందాం అని ధైర్యం చెప్పారు. ప్రతిపక్ష హోదాలో బలహీనవర్గాల తరఫున బలంగా కొట్లాడుదామని వచ్చే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టం అని ఎవరు వచ్చినా 24 గంటలు తన ఆఫీసు తలుపులు తీసే ఉంటాయని తనకు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీల హామీలను అర్హులైన ప్రజలందరికీ అందజేస్తుందని ఆశిస్తున్నానని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.