ఇద్దరూ.. ఇద్దరే..!

ఇద్దరూ.. ఇద్దరే..!
  • నాడు సతుల జడ్పీటీసీ కోసం 'పతులు'..
  • నేడు పతుల ఎమ్మెల్యే కోసం 'సతులు'..
  • తోడు, నీడగా అడుగులు వేస్తున్న దంపతులు..
  • ప్రచారంలో దూసుకుపోతున్న గండ్ర జ్యోతి, గండ్ర పద్మలు..
  • భూపాలపల్లిలో ఆసక్తికర రాజకీయాలు..
  • తడుక సుధాకర్ గౌడ్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావుల మధ్య ఉత్కంఠ పోటీ నెలకొనగా, వారికి అండగా సతులు రంగంలోకి దిగి పోటాపోటీ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భార్యాభర్తలు తోడునీడగా ఉంటూ, రాజకీయాల్లో తమదైనశైలిలో ముందుకు సాగుతున్నారు. భార్య గెలుపుకోసం భర్త కృషి చేస్తే, భర్త గెలుపు కోసం భార్య కృషి చేస్తుంది. గత జడ్పీటీసీ ఎన్నికల్లో గండ్ర జ్యోతి, గండ్ర పద్మలు వేర్వేరు మండలాల్లో పోటీ చేసి గెలుపొందారు. వారి గెలుపు కోసం వారి భర్తలే అప్పట్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం వారి భర్తలు భూపాలపల్లి ఎమ్మెల్యే బరిలో నిలువగా రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేయడం స్థానికంగా విశేషంగా చెప్పుకుంటున్నారు. 

పతుల అండదండలతో నాడు జడ్పీటీసీగా సతుల విజయం..

నాడు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో  తమదైన శైలిలో చక్రం తిప్పి సతులను గెలిపించుకున్నారు పతులు. నేడు ఎమ్మెల్యే ఎన్నికల్లో పతుల గెలుపు కోసం ప్రచార పోరాటం చేస్తున్నారు సతులు.గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏఐఎఫ్ బీ పార్టీ నుండి బరిలో ఉన్న గండ్ర సత్యనారాయణ రావుపై కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న గండ్ర వెంకటరమణా రెడ్డి కొద్ది ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా, గండ్ర సత్యనారాయణ రావు ఏఐఎఫ్ బీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఎన్నికల అనంతరం జరిగిన గత జడ్పీటీసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం నుండి పోటీ చేసి గెలుపొందారు. జడ్పీ చైర్మన్ గా కూడా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బరిలో నిలిచి ఓటమి పాలైన గండ్ర సత్యనారాయణ రావు సతీమణి గండ్ర పద్మ కూడా గణపురం మండలం నుండి జడ్పీటీసీగా పోటీ  పోటీ చేసి విజయం సాధించారు.  వేర్వేరు మండలాల్లో జ్యోతి, పద్మలు  జడ్పీటీసీలుగా విజయం సాధించడం వెనుక వారి పతుల సహాయ సహకారాలే తోడ్పాటునందించాయి. 

జడ్పీటీసీల పతులే ఎమ్మెల్యే బరిలో.. 

జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ గా ఉన్న గండ్ర పద్మ, గండ్ర జ్యోతిల పతులే నేడు ప్రధాన పార్టీల నుండి భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపుకోసం ఆయన సతీమణి, జడ్పీచైర్మన్ గండ్ర జ్యోతి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు గెలుపు కోసం ఆయన సతీమణి గండ్ర పద్మలు ప్రచారం రంగంలో దూకారు. భూపాలపల్లిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరమణా రెడ్డి, సత్యనారాయణ రావుల మధ్యే ఉత్కంఠ పోటీ జరుగగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే గట్టీ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితులలో వారి సతులు రంగంలోకి దిగి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. జడ్పీటీసీగా ఉన్న సొంత మండలంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కలియ తిరుగుతూ సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి పార్టీ స్థితిగతులను తెలుసుకుంటూ గ్రామాలను చుట్టు ముట్టేస్తున్నారు. తోటి మహిళలను, ప్రజలను కలుస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ఓ వైపు, వారి సతీమణులు మరో వైపు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో దుమ్ము లేపుతున్నారు. పతుల కోసం సతుల చేస్తున్న ఈ పోరాటంలో ఎవరు నెగ్గుతారో.. ఎవరు ఓటమి చెందుతారో.. ననే ఆసక్తి నియోజకవర్గంలో నెలకొంది.