హమాలీలనే శాసిస్తున్న వ్యాపారి

హమాలీలనే శాసిస్తున్న వ్యాపారి
  • ప్రభుత్వ కొనుగోళ్లకు వెళ్లకుండా అడ్డుకట్ట
  • సొంత వ్యాపారంతో ముందుకు
  • తాను చెప్పినట్టే వినాలని హుకుం
  • కేంద్రాలలోనే నిరీక్షిస్తున్న రైతులు

చిగురుమామిడి ముద్ర న్యూస్:మండల కేద్రంలో ఆయన ఒక వ్యాపారి. ఏళ్ల తరబడిగా సొంత వ్యాపారం చేసుకుంటూ ఎదుగుతున్నాడు.   ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కాంట వేయకుండా అమాలీలను తీసుకువెళ్తున్నాడు. ఈయన వ్యవహారం వలన రోజుల తరబడి కొనుగోలు సెంటర్లోనే ధాన్యాన్ని నిల్వ ఉంచుకునే పరిస్థితి. దీనివలన ధాన్యం ఎక్కువ రోజులు ఎండలో ఉండడంవలన ధాన్యంలో నూక శాతం ఎక్కువై ధర తగ్గే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.   ప్రతిరోజు  చిగురుమామిడి ఐకెపి సెంటర్లో రెండు లోడ్ల ధాన్యాన్ని మాత్రమే కాంట చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.  

ధాన్యం నిల్వలు ఉన్న హమాలీలు  తూకం వేయకుండా మండల కేంద్రంలోని సదరు వ్యాపారి మాటలకు భయపడి ఆయన వ్యాపార కార్యకలాపాలలో మునిగితేలుతున్నారు.  ఓ మహిళ రైతు చిగురుమామిడి ఐకెపి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి 45 రోజులు గడుస్తున్న... ఆమె ధాన్యం మాత్రం తూకం వేయడం లేదు. దీనితో ఆ మహిళ ప్రతిరోజు ఉదయం కొనుగోలు కేంద్రానికి రావడం హమాలీలను బ్రతిమలాడడం వారు కాంట వేయకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళడం నిత్య కృత్యంగా మారింది.  ఆమెతోపాటు పలుకుబడిన రైతులు ధాన్యాన్ని తెస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేసి మిల్లుకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.

అది కూడా సదరి వ్యాపారి సూచనలతోనే సాగుతున్నట్లు సమాచారం. ఐకెపి కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోవడం వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు కల్లాల వద్ద ధాన్యాన్ని నిలువ చేస్తున్నారు. ఇది సదరు వ్యాపారికి కలిసి వస్తుంది. రైతులను నమ్మించి తక్కువ ధరకు ధాన్యాన్ని సదరు వ్యాపారి కొంటున్నాడు. ఇంత తతంగం మండల స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ సదరు వ్యాపారిని మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. దీనికి సదరు వ్యాపారి పలుకుబడి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి హమాలీలు ఐకెపి కొనుగోలు కేంద్రాలలోని ధాన్యాన్ని తూకం వేయాలి. ఒకవేళ కేంద్రాలలో దాన్యం లేకుంటేనే ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం తూకం వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సదరు వ్యాపారి మభ్యపెడుతున్నడంతో అమాలీలు కూడా ఏమి చేయలేకపోతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వెంట వెంటనే కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలి రైతులు కోరుతున్నారు.