ఇండ్లను కూల్చివేశారు...రోడ్డు విస్తరణ విస్మరించారు

ఇండ్లను కూల్చివేశారు...రోడ్డు విస్తరణ విస్మరించారు

మంచిర్యాల పురపాలక సంఘం అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల వాసులకు అభివృద్ధి పేరిట మేలు కంటే నష్టం ఎక్కువగా చేస్తున్నారనే అపవాదులను మూటకట్టుకున్నారు. హమాలివాడ లో రోడ్డు విస్తరణ పేరుతో పలు ఇండ్లను కూల్చివేసిన అధికారుల తీరు అందుకు అద్ధం పడుతోంది. హమాలివాడ సామిల్ చౌరస్తా నుంచి తిలక్ నగర్ వరకు 60 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టి అభివృద్ధి చేస్తామని అధికారులు రోడ్డు ఇరువైపులా ఇండ్లను బలవంతంగా కూల్చివేశారు. దీంతో ఒక్కో ఇంటి యజమాని ఒకటి  రెండు రూముల వరకు కూల్చివేతలో కోల్పోయారు. 60 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ చేపట్టి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని చెప్పిన అధికారులు ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు రహదారి విస్తరణ పనులు చేపట్టకపోవడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ పనులు మొదలుపెట్టకపోవడంతో కూల్చివేసిన ఇండ్లను పునర్నిర్మించుకోవాలా లేక ఇలాగే మొండి గోడలతో ఉండాలా అని ఇండ్ల బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనామున్సిపల్  అధికారులు స్పందించి రహదారి విస్తరణ పనులు చేపట్టి స్థానికుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.