మీడియా అకాడమీ శిక్షణలో వాతావరణ అంశాన్ని- చేర్చుతాం -చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

మీడియా అకాడమీ శిక్షణలో వాతావరణ అంశాన్ని- చేర్చుతాం -చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

విజయవంతంగా ముగిసిన శిక్షణ తరగతులు

యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ సహకారంతో, వ్యూస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో, ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు, బషీర్ బాగ్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో, వాతావరణంలో మార్పులు -*విపత్తులు అంశంపై జరిగిన జర్నలిస్టుల శిక్షణ తరగతులు శుక్రవారం రోజు ముగిశాయి. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో ఈసారి "వాతావరణ మార్పులు" అంశాన్ని చేర్చి పాత్రికేయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ అంశాల్లో మీడియా అకాడమీ శిక్షణ ఇచ్చేదని, ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ మార్పులు - పర్యావరణం ఆవశ్యకత దృష్ట్యా పాత్రికేయులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తామని చెప్పారు. వర్షాకాలంలో రైతులు ఆకాశం వైపు చూస్తుండగా, మిగతా కాలాల్లో అకాల భారీ వర్షాలు, బోర్లు ఎండిపోవడం, మంచినీటి ఎద్దడి తలెత్తడం, కాలాలకు తగ్గట్లు వాతావరణం ఉండటం లేదని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనికి వాతావరణంలో వస్తున్న మార్పులే కారణమని అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులపై పాత్రికేయులకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ ఎంతో దోహదపడిందని, ఈ విషయాలను శిక్షణ పొందిన పాత్రికేయులు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని కోరారు. యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్ జనరల్ ప్రజా వ్యవహారాల అధికారి అలెగ్జాండర్ మెక్ లార్సన్ మాట్లాడుతూ 
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలను ఎప్పటికప్పడు అప్రమత్తం చేసేందుకు పాత్రికేయులు తమ వంతు కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహాత్ అలీ మాట్లాడుతూ వాతావరణ మార్పులు ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన సామాజిక భాధ్యత పాత్రికేయులపై ఉందని అభిప్రాయపడ్డారు. రెండు రోజుల వర్క్ షాప్ కు విశేష స్పందన లభించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యూస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భీమారావు, సీనియర్ పాత్రికేయులు యూ.సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొనగా, కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సీనియర్ పాత్రికేయురాలు పద్మావతి వ్యవహరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 
ఈ శిక్షణ తరగతులకు హాజరైన వంద మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు శ్రీనివాస్ రెడ్డి, అలెగ్జాండర్ మెక్ లార్సన్ లు సర్టిఫికెట్లు అందచేశారు.