వ‌ట్టెం ప్రాజెక్టులో మానవీయత లేని భూ సేకరణ..

వ‌ట్టెం ప్రాజెక్టులో మానవీయత లేని భూ సేకరణ..

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: వ‌ట్టెం ప్రాజెక్టులో ముంపున‌కు గుర‌వుతున్న అంకాన్ ప‌ల్లి తాండా, కారుకొండ తాండా, రామిరెడ్డి ప‌ల్లి తాండా, జీ గుట్ట తండా, అంకాన్ ప‌ల్లి గ్రామాల భూ నిర్వాసితులు ప్రాజెక్టు సంద‌ర్శ‌న సంద‌ర్భంగా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. వీరంతా ద‌ళిత‌, గిరిజ‌న నిరుపేద ప్ర‌జ‌లే. వీరిప‌ట్ల మాన‌వీయ కోణంలో ఆలోచ‌న చేసి భూమికి భూమి, ఊరికి ఊరు క‌ట్టించ‌డం, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించాల్సి ఉండేది. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్  సోనియాగాంధీ తీసుకువ‌చ్చిన 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం అమ‌లు చేయ‌కుండా ఈ ద‌ళిత‌, గిరిజ‌నుల భూముల‌ను జీఓ నెంబ‌ర్ 123 ప్ర‌కారం బ‌ల‌వంతంగా గుంజుకోవ‌డం అన్యాయం. పేద‌ల‌కు న్యాయం చేయ‌కుండా భూముల‌ను తీసుకోవ‌డం వారిని నైతికంగా చంపేయ‌డంతో స‌మానం 2015 జూన్ 11న పాల‌మూరు - రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు భూత్పూర్ మండ‌లం క‌రివెన వ‌ద్ద మీరు శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా హ‌రిహ‌ర బ్ర‌హ్మాదులు ఎదురైనా.. ఆరునూరైనా త‌ల తాక‌ట్టు పెట్టైనా పాల‌మూరు - రంగారెడ్డి ప్రాజెక్టును 30 నెల‌ల్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏడేళ్లు అవుతున్నా ఇంకా 50 శాతం ప‌నులు కూడా పూర్తీ కాలేద‌ని ప‌నుల‌ను ప‌రిశీలించాక అర్థ‌మైంది. ముంపునకు గుర‌వుతున్న కుటుంబాల్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి.. నిర్వాసితుల క‌డుపు నింపాకే.. ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. వ‌ట్టెం ప్రాజెక్టు సంద‌ర్శ‌న సంద‌ర్భంగా నిర్వాసితులు త‌మ గోడు వెళ్ల‌బోసుకున్న త‌రువాత‌... నాకు అర్థ‌మైంది ఒక్క‌టే. శంకుస్థాప‌న స‌మ‌యంలో మీరు చెప్పిన‌దానికి.. ఇక్క‌డ జ‌రిగిన దానికి పూర్తి భిన్నంగా ఉంది.

మానవీయతను వట్టెం ప్రాజెక్టు పునాదుల్లో సమాధి చేశారు. వ‌ట్టెం ప్రాజెక్టు నిర్మాణానికి భూసేక‌ర‌ణ చేస్తున్నఅంకాన్ ప‌ల్లి తాండా, కారుకొండ తాండా, రామిరెడ్డి ప‌ల్లి తాండా, జీ గుట్ట తండా, అంకాన్ ప‌ల్లి నిర్వాసితులు మొత్తం ద‌ళిత‌, గిరిజ‌న‌ ప్రజ‌లు నన్ను కలిసి..  ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇక్క‌డ‌కు వ‌చ్చి మా  క‌డుపులు నింపాకే ప్రాజెక్టు ప‌నులు మొద‌లు పెడతామ‌ని చెప్పారు. కానీ ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ఎండ‌బెట్టి, రోడ్డున ప‌డేసి ప్రాజెక్టు క‌ట్టిస్తున్నాడ‌ని బాధితులు చెప్పారు.ఈ ప్రాజెక్టులో మొత్తంగా  4500 ఎక‌రాలు, 463కు పైగా నివాస గృహాలు.. నాలుగు తండాలు, క పల్లె ప్రాజెక్టులో సంపూర్ణంగా పోయాయి.  ఈ నిర్వాసితులకు 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం ప‌రిహారం, ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండ‌గా.. జీఓ నెంబ‌ర్ 123 ప్ర‌కారం ప‌రిహారం ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. భూమికి భూమి అడిగిన బాధిత నిర్వాసితుల‌ను జైలుకు పంపుతామ‌ని బెదిరించ‌డం పూర్తిగా రాజ్యాంగ హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే. ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ ముందు చేసిన సోష‌ల్ ఎక‌నామిక్ స‌ర్వేలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని బాధితులు చెప్ప‌డం జ‌రిగింది. ప‌ద్దెనిమిదేళ్లు నిండిన 154 మందికి రీ హ్యాబిటేష‌న్ ప్యాకేజీ రాలేద‌ని మా వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కారుకొండ లోని స‌ర్వే నెంబ‌ర్ 87లో 150 ఎక‌రాల్లో ద‌ళితులు కాస్తులో ఉన్నారు. అందులోని 20 ఎక‌రాలు కాస్తులో ఉన్న‌వారికి డ‌బ్బులు ఇవ్వ‌కుండా కొద్దిమంది దళారులు స్వాహ చేశార‌ని బాధితులు చెప్పారు.  

మాన‌వీయ కోణం లేకుండా భాధ్య‌త‌లేని ప్ర‌భుత్వం ఊరికి ఊరు, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌కుండా, బ‌లవంతంగా పోలీసుల‌ను ప్ర‌యోగించి రాత్రికి రాత్రి ముంపున‌కు గుర‌వుతున్న ఊర్ల‌ను ఖాళీ చేయించి ప్రాజెక్టు నిర్మాణం చేయ‌డం మాన‌వీయ‌త‌ను చంపేసిన‌ట్టే. ఎక‌రం, రెండెక‌రాల భూమి ఉన్న పేద‌ల‌కు అదే జీవితం, అదే బ‌తుకుతెరువు.. భ‌విష్య‌త్తు కూడా. వంద‌ల ఎక‌రాలున్న మీ లాంటి వారికి భూమి విలువ తెలియ‌క‌పోవ‌చ్చు. రెండుమూడెక‌రాలున్న పేద‌లు ఊరు, భూమి కోల్పోవ‌డంతో వాళ్ల జీవితాలు త‌ల‌కిందులై రోడ్డున ప‌డ‌తారు. బాధ్య‌త క‌లిగిన పాల‌కులు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాలి. మాన‌వీయ కోణం లేని ఏ అభివృద్ధి అయినా.. యాంత్రిక‌ స‌మానం అవుతుందే త‌ప్ప‌.. స‌మాజ నిర్మాణం కాజాల‌దు. స‌మాజ హితం లేని ఏ అభివృద్ధి సంక్షేమ, శ్రేయోరాజ్యం కాలేదు. ముఖ్య‌మంత్రిగా మీరు ప్ర‌జాశ్రేయ‌స్సు ప‌ట్ల ఆలోచ‌న చేసి.. వ‌ట్టెం రిజ‌ర్వాయ‌ర్ కింద భూములు కోల్పోతున్న నిర్వాసితుల‌కు 2013 భూ సేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం భూమికి భూమి, ఊరికి ఊరు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను.