డీసీసీ పీఠం కొమ్మూరికేనా..! 

డీసీసీ పీఠం కొమ్మూరికేనా..! 
  • ఉమ్మడి వరంగల్ రాజకీయాలపై ఏఐసీసీ స్పెషల్‌ ఫోకస్
  • నేడు జిల్లాలోకి రేవంత్‌ రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర

జనగామ, ముద్ర ప్రతినిధి : టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై ఏఐసీసీ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనగామ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వర్గపోరుకు చెక్‌ పెట్టేందుకు హైకమాండ్‌ కరసత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి జనగామ డీసీసీ పీఠం అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రేవంత్‌రెడ్డి హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర కొనసాగుతుండడంతో ప్రకటనను హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది. 


ముగ్గురితో ముప్పుతిప్పలు 
ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న జనగామ 2014లో టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గెలుపుతో పార్టీ బీటలు వారింది. అప్పటి నుంచి పార్టీ పతనం మొదలైంది. ఆ తర్వాత స్థానిక నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలంగాణ తొలి పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించినా ఆయన జిల్లా పార్టీపై పెద్దగా దృష్టిపై పెట్టలేదు. ఫలితంగా 2018లో ఆయన మరోసారి ఓటమి పాలయ్యారు. తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు పాలకుర్తి ఇన్‌చార్జి, ప్రస్తుత డీసీసీ ప్రెసిడెంట్‌ గా ఉన్న జంగా రాఘవరెడ్డి, ఇటు చేర్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి జనగామ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఈ ముగ్గురి లీడర్ల రాజకీయాలతో కొన్ని రోజులుగా పార్టీ క్యాడర్‌ ము‌ప్పుతిప్పలు పడుతోంది. ఇప్పటికే దాదాపు లీడర్లంతా మూడు వర్గాలుగా వీడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారయ్యారు. అయితే వీరందరినీ ఏకాతాటికి తెచ్చే సామర్థ్యం కొమ్మూరికి ఉందని హైకమాండ్‌ ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో జనగామ డీసీసీ పీఠాన్ని ఆయనకు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


పొన్నాల సపోర్ట్‌ ఉంటుందా!
జనగామ డీసీసీ పీఠం కోసం జంగా, కొమ్మూరి పోటీ పడుతున్న విషయం పార్టీ క్యాడర్‌‌లో బహిరంగ రహస్యమే.. అయితే వీరిద్దరి బలాబలాలు, పార్టీ భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్‌ ఇన్ని రోజులు ఆచీతూచి అడుగులు వేస్తూ వచ్చింది. ఇప్పటికే స్థానిక లీడర్లతో పలు సార్లు మాట్లాడి కొమ్మూరిపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మరో వైపు గత ఎన్నికల్లో పొన్నాల కోసం పనిచేసిన కొమ్మూరికి డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ఆయన సపోర్ట్‌ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.


నేడు జిల్లాకు రేవంత్‌ రెడ్డి యాత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర బుధవారం పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల నుంచి జిల్లాలోకి ప్రవేశించనుంది. అయితే ఈ యాత్ర దేవరుప్పుల నుంచి జిల్లా కేంద్రమైన జనగామ వైపు కాకుండా పాలకుర్తి మీదుగా వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌‌ మీదుగా నుంచి వరంగల్‌ వైపు వెళ్లనుంది. జనగామలో ఉన్న వర్గపోరు నేపథ్యంలోనే యాత్రను అటు మళ్లీంచినట్లు పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అయితే పార్టీ సీనియర్ లీడర్లు సైతం రేవంత్‌ రెడ్డి యాత్రపై సైలెంట్‌గా ఉండడం క్యాడర్‌‌ ఆయోమయం పడిపోయింది. కానీ, మాజీ ఎమ్మెల్యే కొమ్మురి ప్రతాప్‌రెడ్డి మాత్రమే పాదయాత్రను విజయవంతం చేయాలని మంగళవారం కార్యకర్తలకు పిలుపునివ్వడం గమనార్హం.
ఫొటో రైటప్​ రేవంత్​రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కొమ్మూరి