కొవిడ్‌ తాజా విజృంభణకు ఈ వేరియంట్‌ కారణమా..?

కొవిడ్‌ తాజా విజృంభణకు ఈ వేరియంట్‌ కారణమా..?

 దేశంలో కొన్ని రోజులుగా కొవిడ్‌-19తోపాటు ఇన్‌ఫ్లుయెంజా  కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  ఈ క్రమంలో రోజువారీ కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడానికి కొత్త వేరియంట్‌ కారణమా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులకు నిర్వహించిన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో  349 కేసులు ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించినవే ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దేశంలో కొవిడ్‌ తాజా విజృంభణకు ఈ వేరియంట్‌ కారణం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  దేశంలో మొదటిసారిగా ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌కు సంబంధించి రెండు కేసులు జనవరిలో బయటపడ్డాయి. ఫిబ్రవరిలో 140 నమూనాల్లో ఇవి వెలుగు చూడగా.. మార్చి నెలలో మరో 207 గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం  వెల్లడించింది. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 349 నమూనాల్లో ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ బయటపడినట్లు ఇన్సాకాగ్‌ తెలిపింది.

అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వేరియంట్‌ కేసులు 105 వెలుగు చూడగా.. తెలంగాణలో 93, కర్ణాటకలో 61, గుజరాత్‌ 54 కేసులు బయటపడినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ తాజా విజృంభణకు కొత్త వేరియంట్‌ కారణమై ఉండొచ్చని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ తీవ్ర జబ్బు, మరణానికి దారితీయనంతవరకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్‌లో మ్యుటేషన్లు జరుగుతున్నా కొద్ది ఇటువంటి కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయన్నారు.

దేశవ్యాప్తంగా ఇటీవల కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 1300 దాటింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మరణించారు. 140 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసుల పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి కూడా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లపై జాగ్రత్తగా ఉంటూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా కొత్త వేరియంట్లను వేగంగా గుర్తించేందుకు గాను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను అధిక స్థాయిలో చేపట్టాలని అధికారులకు సూచించారు.