ఆగస్టు 9న పార్లమెంట్ ముందు జర్నలిస్టుల నిరసన

ఆగస్టు 9న పార్లమెంట్ ముందు జర్నలిస్టుల నిరసన

కాన్ఫెడరేషన్ పిలుపు

న్యూఢిల్లీ: వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానెళ్లలో జర్నలిస్టుల అక్రమ తొలగింపునకు నిరసనగా ఆగస్టు 9న పార్లమెంటు భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు రాస్ బిహారీ, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ యాదవ్ ప్రకటించారు. ఉద్యోగాల నుంచి తొలిగించిన వర్కింగ్ జర్నలిస్టులను, ఇతర సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలనే డిమాండ్లతో రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా వార్తాపత్రికలు, న్యూస్‌ఛానెళ్ల యాజమాన్యాలు జర్నలిస్టులను, నాన్ జర్నలిస్టులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా కాలంలో నష్టాల సాకుతో నష్టపరిహారం లేకుండా లక్షలాది మంది ఉద్యోగులను మీడియా సంస్థల నుండి తొలగించారన్నారు. అలాగే మీడియా ప్రతినిధుల ఇతర సమస్యలు కూడా డిమాండ్ల పత్రంలో ఉంటాయని వారు తెలిపారు. నిరసన ప్రదర్శనలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, ఎన్ యు జె (ఐ ) ప్రధాన కార్యదర్శి ప్రదీప్ తివారి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రధాన కార్యదర్శి పరమానంద పాండే, సమాఖ్యలోని ఇతర సంఘాల నాయకులు పాల్గొంటారని ఎమ్మెస్ యాదవ్ తెలిపారు. మెమోరాండం ఇస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వార్తాపత్రికలు, ఛానెళ్లలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు ముందు దేశంలోని వివిధ రాష్ట్రాలలో సభలు, సమావేశాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.