‘భారత్​జోడో–2’ గట్టిపోటీ

‘భారత్​జోడో–2’ గట్టిపోటీ
  • యాత్రపైనే కాంగ్రెస్​ నేతల ఆశలు
  • రూట్​మ్యాప్​సిద్ధం చేస్తున్నామంటున్న దిగ్గజ నేతలు
  • యాత్ర సక్సెస్​తో బలం పుంజుకోనున్న ఇండియా కూటమి

ముద్ర సెంట్రల్​ డెస్క్​: రాహుల్​గాంధీ భారత్​జోడో యాత్రతో విశేషాధారణ దక్కించుకున్న కాంగ్రెస్​ పార్టీ దేశంలోని విపక్షాలన్నింటినీ ఒక్కటి చేయడంలో సఫలమైంది. మరోవైపు అటు కర్ణాటక ఎన్నికల్లోనూ విజయం సాధించి నూతనోత్సాహాంతో ముందుకు వెళుతోంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్నా.. పార్టీలో ఏదో కొదవ ఉందనే ఆయా రాష్ర్టాల నేతలు భావిస్తున్నారు. ఈ కొదవను పూడ్చాలంటే రాహుల్​గాంధీ మరోమారు వీలైనంత త్వరగా ‘భారత్​జోడో–2’ యాత్రను చేపట్టాలంటున్నారు. రాహుల్​మొదటి విడత చేపట్టిన యాత్రకు విశేషాదరణ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్​పై ఏదో ఒక విషయంలో ఎదురుదాడి చేస్తోనే ఉంది. ఇంకోవైపు ఆ పార్టీతో నడుస్తున్న వివిధ పార్టీల నేతలను ఏదో ఒక రూపంలో భయపెడుతుందనే వాదనలున్నాయి. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను విరివిగా బీజేపీ వినియోగించుకుంటున్నదని విపక్ష పార్టీల ఆరోపణ. 

  • యాత్ర ఆలస్యం.. బీజేపీ స్వలాభం..

ఇదే సమయంలో చిన్నా చితకా పార్టీలతో కలిసి కాంగ్రెస్​ కూటమి ‘ఇండియా’ను ఏర్పాటు చేసింది. అయినా ఆ కూటమిలోనూ ఏదో వెలితి సీట్ల విషయంలోనో, ఆయా నేతల మధ్య పొరపొచ్చాల వల్లనో ఇలా అనేకానేక సమస్యలు ఇండియా కూటమిలోనూ ఉన్నాయి. వీటినే ఆసరాగా తీసుకుంటున్న బీజేపీ ఆయా పార్టీల దిగ్గజ నేతలను నయానో–భయానో దగ్గర చేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేసేస్తోంది. ఇంకోవైపు రాహుల్​ భారత్​జోడో–2 యాత్ర ఇంకా మొదలు కాకపోవడంతో దేశప్రజల్లో కాంగ్రెస్​ఉన్న కాస్త ఆశలు కూడా ఆవిరైపోయే ప్రమాదం లేకపోలేదని పలువురు నేతలు వెల్లడిస్తున్నారు.

  • రోడ్​మ్యాప్ సిద్ధమవుతుందా?

కాగా  రెండో విడత యాత్రపై కాంగ్రెస్​ పార్టీ ఉన్నత వర్గాల నుంచి కీలక సమాచారం అందుతోంది. రాహుల్​గాంధీ  చేపట్టే యాత్రపై ఇంకా రోడ్​మ్యాప్​ సిద్ధం కాలేదని సమాచారం. రోడ్​మ్యాప్​పై పార్టీలోనే పలువురు నేతల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. అయితే ఇవన్నీ ఆటుపోట్లను దాటుకొని రాహుల్​ రోడ్​మ్యాప్​ సిద్ధం చేసుకొని యాత్రను వీలైనంత త్వరగా చేపడితే దేశవ్యాప్తంగా రాహుల్​గాంధీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మరింత చూరగొనే అవకాశం ఉంది. మరోవైపు కూటమి నేతలకు కూడా ‘భారత్​జోడో–2’ యాత్ర నూతనోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్​డీయే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు స్పష్టం చేస్తుండగా, ఇండియా కూటమికి కేవలం 140 నుంచి 150 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్​డీయేను ఎదుర్కోవాలంటే మొత్తం 543 ఎంపీ స్థానాల్లో సగం కంటే ఒక్కసీటు ఎక్కువ సాధించాల్సి ఉంటుంది. అంటే 273 సీట్ల సొంత బలం అవసరం ఉంటుంది. ఇన్ని అంటే ఇండియా కూటమి మొత్తం 150 స్థానాలుగా అంచనా వేసుకుంటే 123 స్థానాలను సాధించాల్సి ఉంటుంది. అన్ని స్థానాల్లో ఇండియా కూటమి పై చేయి సాధిస్తేనే ఎన్​డీయేను గద్దె దింపేయగలదు. 

  • దేశంలో రాహుల్​కే చరిష్మా..

ఇక్కడ మరో అంశం పరిశీలించుకోవాలి. బీజేపీ గతంలో సాధించిన స్థానాలు దేశవ్యాప్తంగా 303. ఇక ఎన్​డీయే కూటమితో జతకలిసిన పార్టీల బలం మరో 50 ఖచ్చితంగా సాధిస్తుందన్నది నిపుణుల అభిప్రాయం ఈ లెక్కన చూసుకుంటే ఎన్​డీయే కూటమిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి దేశంలో చరిష్మా ఉన్న నేత ఎవ్వరైనా ఉన్నారంటే అదే రాహుల్​గాంధీ. అందుకే నేతలు రాహుల్​భారత్​జోడో–2కు తొందరపడుతున్నారు. 

  • సీరియస్​గానే రూట్​మ్యాప్​ పనిలో దిగ్గజాలు..

ఇప్పటికీ గానీ ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్​ అధిస్టానం యాత్ర రూట్​మ్యాప్​ను సీరియస్​గానే సిద్ధం చేసే పనిలో పడింది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ‘భారత్ జోడో యాత్ర 2.0’ మొదలుకానుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌ జోడో యాత్ర నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ చీఫ్ దిగ్విజయ్‌ సింగ్‌.. రెండో విడత యాత్ర కోసం యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.గత వారం నుంచి పార్టీలోని పలువురు కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర 2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్‌ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ సభ్యుడు ఒకరు తెలిపారు.

  •  యాత్ర పోర్​బందర్​నుంచి? యూపీపై ప్రత్యేక దృష్టి..

భారత్​జోడో–2ను గాంధీ జన్మస్థలం పోర్‌బందర్‌ నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. పోర్‌బందర్‌ నుంచి పలు రాష్ట్రాల గుండా త్రిపురలోని అగర్తలతో యాత్ర ముగిసేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో యాత్ర 2.0లో ఉత్తర్ ప్రదేశ్‌లోని ఎక్కువ నియోజకవర్గాలు మీదుగా సాగేలా ప్లాన్ చేస్తున్నట్టు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిజ్‌లాల్ ఖబ్రీ అన్నారు. అయితే యూపీలో 80 ఎంపీ స్థానాలున్నాయి. అందుకే దీనిపై ప్రత్యేక దృష్టిని కూడా పెట్టారు. అందుకే ఎక్కువ నియోజకవర్గాలను ఇక్కడ కవర్​చేసేలా ప్లాన్​ చేస్తున్నారు. 

  • భారత్​జోడో–2తోనే ఇండియా కూటమికి లాభం..

గతంలో జరిగిన యాత్ర తక్కువ ప్రాంతాల్లో తక్కువ సమయం జరగడంతో స్థానిక నేతలు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్​యాత్రతో వారిలో నూతనోత్సాహాన్ని నింపితే కేవలం యూపీ నుంచే భారీ స్థానాలను కాంగ్రెస్​ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు జరిగినా ఆ పార్టీలు కూడా కాంగ్రెస్​ వెంటే నడుస్తాయి కాబట్టి ఎన్డీయేకు ఇక్కడి నుంచే గట్టిపోటీనిచ్చే సందేశాన్ని పంపొచ్చు. బీజేపీని ఇరకాటంలో పెట్టొచ్చు. ఏది ఏమైనా రాహుల్​గాంధీ ‘భారత్​జోడో–2’తో కాంగ్రెస్​ పార్టీకి, ఇండియా కూటమికి నూతనోత్సాహంతోబాటు లాభం చేకూరునుందన్నది స్పష్టం అవుతోందని రాజకీయ పండితులు అంటున్నారు. .