తీహార్ జైలులో మొదటిరోజు సిసోడియా ఎలా గడిపారంటే..?

తీహార్ జైలులో మొదటిరోజు సిసోడియా ఎలా గడిపారంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించడంతో తీహార్ జైలుకు వెళ్లిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు జైలులో సీనియర్ సిటిజెన్స్ సెల్‌ కేటాయించారు.  ప్రస్తుతం ఆయన ఒక్కరే అందులో అంటున్నారు. ఈనెల 20వ తేదీ వరకూ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు.  సిసోడియాను తీహార్ జైల్ నెంబర్-1లోని వార్డ్ నెంబర్-9లో ఉంచామని, సీసీటీవీ పర్యవేక్షణలో ఈ సెల్ ఉందని జైలు అధికారులు తెలిపారు. సమీప భవిష్యత్తులో మరొకరితో ఆయన సెల్ పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కాగా, సిసోడియా ఉంటున్న వార్డులోని వేరే గదుల్లో కొందరు కరడుగట్టిన నేరస్థులు కూడా ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం సోమవారం మధ్యాహ్నం సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యం నార్మల్‌గానే ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. సిసిడియాతో పాటు చిన్న కిట్‌కు జైలు అధికారులు అనుమతించారు. అందులో టూత్‌పేస్ట్, టూత్ బ్రష్, సబ్బు, ఇతర నిత్యావాసర వస్తువులు ఉన్నాయి. రాత్రి డిన్నర్ టైమ్‌లో సుమారు 6-7.30 గంటలకు చపాతీ, రైస్, ఆలూ కర్రీ ఆయనకు ఇచ్చారు. విచారణ ఖైదీగా ఉన్న సిసోడియాను జైలు నిబంధనలకు అనుగుణంగా సదుపాయంగా ఉండే డ్రస్ వేసుకునేందుకు అనుమతించారు. జైలు నుంచి అదనపు దుస్తుల సదుపాయం కూడా ఉంది.