కెసిఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగం

కెసిఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగం

 కెసిఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగం. రైతు గుండె లోతుల్లో నిక్షిప్తమైన మహోన్నత వ్యక్తి. బిఆర్ఎస్ ప్రభుత్వ ఓటమిని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ 420 అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చింది. తెలంగాణ కోసం ప్రాణం పెట్టి కొట్లాడిన నాయకులం. తెలంగాణ అభివృద్ధికి పరిపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులం. పార్లమెంటులో కొట్లాడే సత్తా ఉన్న ఉద్యమకారులం. దశాబ్ద కాలంలో  ప్రగతిని పరుగులు పెట్టించిన పాలకులం అంటున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ రావుతో "ముద్ర" ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ

 ప్రశ్న : కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి కొరకు మీ వద్ద ప్రత్యేకమైన ప్రణాళిక ఏమైనా ఉందా?

 జవాబు : కచ్చితత్వంతో కూడిన ప్రణాళిక రూపొందించుకున్నాం. కరీంనగర్ ను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతాం. నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఐఐఐటి కోసం 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. నా తర్వాత ఎంపీగా వచ్చిన బండి సంజయ్ దాన్ని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి మానేరు రివర్ ఫ్రంట్ డెబ్బై శాతం పనులు పూర్తి చేశాం. కాళేశ్వరం జలాలతో డ్యాములు నిండుకుండలా ఉంటాయి కాబట్టి మత్స్య పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతా, చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక చర్యలు చేపడతా.

 ప్రశ్న :  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో  కేసీఆర్ ప్రభావం ఎలా ఉండబోతుంది?

 జవాబు : కెసిఆర్ తెలంగాణ ప్రజల భావోద్వేగం. రైతుల గుండె లోతుల్లో నిక్షిప్తమైన మహోన్నత వ్యక్తి. పార్లమెంటు  ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని నిరూపిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్  ఓటమిని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తారు.

 ప్రశ్న : లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఏమేరకు ఉండబోతుంది?

 జవాబు : ఎలాంటి ప్రభావం చూపదు. బిజెపి  రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేసిన అరెస్టుగా భావిస్తున్నాం. కవిత తన సచ్చిలతను నిరూపించుకొని కడిగిన ముత్యం లా  బయటకు వస్తుంది.

 ప్రశ్న : కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందుతుందని బండి సంజయ్ అంటున్నారు దానిపై మీరు ఏమంటారు?

 జవాబు : స్మార్ట్ సిటీ తీసుకురావడంలో నేను కీలకంగా వ్యవహరించాను. 1000 కోట్లతో కరీంనగర్ ను అభివృద్ధి చేశాం. కెసిఆర్ ముఖ్యమంత్రిగా  ఆర్ఓబి, టిటిడి టెంపుల్, కేబుల్ బ్రిడ్జి, ఐటీ పార్క్, మానేరు రివర్ ఫ్రంట్, మెడికల్ కాలేజ్ తో పాటు  అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ అభివృద్ధి కోసం బండి సంజయ్ నయా పైసా తేలేదు. అసత్య ప్రచారాలతో మరోసారి కరీంనగర్ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడు.ప్రజలు వాస్తవాలను గ్రహించారు.

 ప్రశ్న : కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి నిరూపించుకుంది దీనిపై మీరేమంటారు?

 జవాబు : కాంగ్రెస్ 420 అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15 వేల రూపాయలు ఏమైనాయ్? రైతు రుణమాఫీ ఏమైంది? 4 వేల పింఛన్ ఏమైంది? మూడు లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు ఏమైనాయ్? 6 గ్యారెంటీల్లో కూడా కొర్రీలు పెడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెబుతారు

 ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజీ కెసిఆర్ కు అప్రతిష్ట తీసుకువచ్చింది కదా దీనిపై మీరేమంటారు?

 జవాబు : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. సాంకేతిక లోపంతో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. నిపుణులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో రిపేర్ చేసుకోవచ్చు. దీనిని కావాలనే కాంగ్రెస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చేవరకు వెయిట్ చేస్తాం. త్వరలో కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలంగాణ సమాజానికి తెలియజేస్తారు. కాపర్ డ్యాం నిర్మించి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఆ పనిచేయడం లేదు. దీంతో  తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది.

 ప్రశ్న : వేలకోట్లతో కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని బండి సంజయ్ అంటున్నారు దీనిపై మీరేమంటారు?

 జవాబు : ఐదు పైసల అభివృద్ధి చేయని  అసమర్ధ ఎంపీ బండి సంజయ్. నేను ఎంపీగా ఉన్న సమయంలోనే జాతీయ రహదారుల కనెక్టివిటీ సెంటర్ గా కరీంనగర్ ను తీర్చిదిద్దాను. కరీంనగర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ నిర్మాణానికి  కృషి చేశాను. హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. సిద్దిపేట - సిరిసిల్ల - కొత్తపల్లి మీదుగా కరీంనగర్ వరకు పనులు పురోగతిలో ఉన్నాయి. 2025 సంవత్సరంలో ట్రైన్ అందుబాటులోకి రానుంది. నేను చేసిన పనులనే బండి సంజయ్ తను చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఉపాధి హామీ నిధులు, అంగన్వాడి కేంద్రాల నిర్వహణ కేంద్రమే నిధులు ఇస్తుందని గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడం  బండి సంజయ్ అవివేకానికి నిదర్శనం. అది దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ.

 ప్రశ్న : మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు?

 జవాబు : కరీంనగర్ నియోజకవర్గంలో ట్రయాంగిల్  పోటీ జరగనుంది. రెండు లక్షల పైచిలుకు ఓట్లతో  బి ఆర్ ఎస్ జెండా ఎగరవేస్తాం.