హిందూ ఏక్తా యాత్ర పై పోలీసుల డేగ కన్ను

హిందూ ఏక్తా యాత్ర పై పోలీసుల డేగ కన్ను
  • సున్నిత ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్
  • డ్రోన్ కెమెరాలతో నిఘా
  • సి పి సుబ్బారాయుడు పర్యవేక్షణలో పటిష్ట భద్రత

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: హిందూ ఏక్తాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ సి పి ఎల్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో అస్సాం ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పాల్గొననుండడంతో పోలీసులకు మరింత టెన్షన్ పెరిగింది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య యాత్ర కొనసాగుతోంది. దీంతో సివిల్, ఏ ఆర్, టాస్క్ ఫోర్స్, క్యూఆర్టీ టీమ్స్, తెలంగాణ స్పెషల్ పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ సెక్యూరిటీ అధికారులు నాలుగు రోజుల క్రితమే కరీంనగర్ కు చేరుకున్నారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి భద్రతపై కరీంనగర్ సిపి తో పాటు బిజెపి నాయకుల తో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ప్రతి కదలిక రికార్డు అయ్యేలా హిందూ ఏక్తా యాత్ర జరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు రిపేరు చేశారు. డ్రోన్ కెమెరాలతో ప్రతి కదలికను రికార్డు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఆకతాయిలు రాళ్లు విసరకుండా యాత్ర జరిగే ప్రాంతాలలోని బంగ్లాల బాల్కనీలపై నెట్లను ఏర్పాటు చేశారు. బిల్డింగుల పైన పోలీసులను మోహరించి డేగ కన్నుతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ సి పి ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో యాత్రను విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. యాత్ర జరుగుతున్నంత సేపు తానే రంగంలోకి దిగి పోలీసులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. డిసిపిలు చంద్రమోహన్, శ్రీనివాస్ ఏసీపీలు తుల శ్రీనివాసరావు  కరుణాకర్ తో పాటు ఇతర ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు వందలాదిమంది పోలీసులతో యాత్రను అష్టదిగ్బంధనం చేశారు.