దేశ్ కో బచావో బిజెపి కో హటావో

దేశ్ కో బచావో బిజెపి కో హటావో
Desh Ko Bachao BJP Ko Hatao
  • ఈ నెల 16 నుండి ఇంటింటికి సీపీఐ యాత్ర
  • బిజెపి పై పోరాటం ఉదృతం  చేస్తాం
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

  ముద్ర ప్రతినిధి కరీంనగర్ : బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొడుతూ కార్పొరేట్  శక్తులకు కట్టబెడుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశ్ కో బచావో బీజేపీ కో హటావో అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన లు ఉధృతం చేస్తాం అన్నారు. ఈ నెల 16 నుండి ఉమ్మడి జిల్లాలో యాత్ర నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి విస్తృత స్థాయి సమావేశం బoడ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా పాల్గొని చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నల్లధనం వెనక్కి తీసుకోవస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చింది అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రగల్బాలు పలికింది నిజం కాదా అని ప్రశ్నించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం సంపద ఆదానీ, అంబానీలకు కట్టబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడని మండిపడ్డారు. పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో మోడీ పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు.

  ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేసి ప్రజలపై భారం మోపుతున్నారని చాడ ఆరోపించారు. బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అందులోని చట్టాలను సవరణల పేరుతో మార్చాలని కుట్ర పన్నుతున్నారని అన్నారు పౌరుల హక్కులను కాల రాస్తున్నారని స్పష్టం చేశారు మతోన్మాదం పెట్రేగిపోతుందని దేశంలోని దళితులు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మేధావులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి పాలన నుండి దేశాన్ని కాపాడుకోవడం కోసం సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి దేశవ్యాప్తంగా దేశ్ కి బచావో బిజెపికి హఠావో అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు అందుకు సిపిఐ శ్రేణులంతా సిద్ధం కావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్, సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల,జగిత్యాల, పెద్దపల్లి,హనుమకొండ జిల్లాల్లోని 85 మండలాల్లో యాత్ర ఈ నెల 16 నుండి కొనసాగుతుందని వెంకటరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేశాడని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి, భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదని విమర్శించారు వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు మర్రి వెంకటస్వామి, మంద పవన్,గుంటి వేణు,తాండ్ర సదానందం మరియు  జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాసంఘాల ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు