కమనీయం.. రమణీయం ... సీతారాముల కళ్యాణం

కమనీయం.. రమణీయం ... సీతారాముల కళ్యాణం
  • పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి
  • కళ్యాణం తిలకించిన ఈటల, వినోద్ కుమార్, పొన్నం

జమ్మికుంట, ముద్ర: అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం కమనీయం రమణీయంగా గురువారం జరిగింది. సీత రామచంద్రస్వామి ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మేళతాళాల మధ్య పండితుల వేదమంత్రోచరణ మధ్య ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను తలంబ్రాలను సమర్పించారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బల్మూరు వెంకట్ దంపతులు సైతం సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు . హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ,జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు.

ఆలయ ప్రధాన పూజారి శేషం రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని వేలాదిమంది తిలకిస్తుండగా శాస్త్ర యుక్తంగా ఘనంగా నిర్వహించారు. జిలకర బెల్లం తంతు పూర్తి కాగానే అమ్మవారికి తాళిని అలంకరింప చేశారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకై భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. వేలాదిమంది భక్తుల రామనామస్మరణల మధ్య ఆలయ ప్రాంగణం దద్దరిల్లింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 30 వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కాగా కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులకు సరియైన ఏర్పాట్లు చేయకపోవడంతో చాలామంది అసహనం వ్యక్తం చేస్తూ బయటనే ఉండిపోయారు. పోలీసులు సైతం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారికి దగ్గరగా ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించుతూ ఇతరులను అనుమతించకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలోని సీతారాములను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు.