కనులపండువగా రాములోరి పెళ్లి

కనులపండువగా రాములోరి పెళ్లి
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు
  • సీతారాముల జీవితం ప్రపంచానికే ఆదర్శనం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు

ముద్ర ప్రతినిధి, జనగామ : శ్రీరామ నవమి సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో రాములోరీ కల్యాణాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఉషా పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం మాటేడు, తొర్రూరు, నాంచారి మడూరు, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి తదితర దేవాలయాల్లో కల్యాణోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శనీయమన్నారు. వారి వెంట కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య దంపతులు, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా అధికారులు సిబ్బంది ఉన్నారు. 

జనగామ పట్టణంలో..
జనగామ టౌన్‌లో వాడవాడలా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పాత బీట్‌ బజార్‌‌, కళ్లెం రోడ్డులోని శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో, గుండ్లగడ్డలోని సంఘరివాడ తదితర ప్రాంతాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.