లిబియా జలప్రళయం

లిబియా జలప్రళయం
  • 20 వేల మంది మృతి
  • స్థలం లేక సామూహిక ఖననాలు
  • మరో 10 వేల మంది గల్లంతు

లిబియా: ఆఫ్రికా దేశం లిబియా డేనియల్ తుపాను ప్రభావంతో ఒక్కసారిగా అతలాకుతలమైన విషయం తెలిసిందే. గురువారం వరకూ జల ప్రళయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేల వరకు ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది వరదలలో గల్లంతయ్యారని చెబుతున్నారు. అందులో ఇప్పటికీ కొంతమంది ఆచూకీ తెలియలేదు. ఈ విషాదానికి సంబంధించి అరేబియా టెలివిజన్‌తో డెర్నా మేయర్‌ అబ్దుల్‌ మేనమ్ మాట్లాడారు. ఈ మహా విపత్తు కారణంగా నగరంలోని మరణాల సంఖ్య 18 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అక్కడి బీచ్ ఒడ్డున ఎక్కడ చూసిన కూడా శవాలు చెల్లాచెదురుగా పడిన దృశ్యాలే కనిపిస్తు్న్నాయంటూ వాపోయారు. వాటిని చూస్తూంటే ఎంతో బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. శవాలను ఖననం చేయడానికి స్థలం సరిపోవడం లేదని, సామూహిక ఖననం చేస్తున్నామని పేర్కొన్నారు. వరద వచ్చిన సమయంలో చాలామంది నిద్రలో ఉన్నారని. నిద్రలోనే జల సమాధి అయ్యారని వివరించారు. డెర్నా నగరంలోని రహదారులన్నీ కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. గాయపడిన వారికి కూడా చికిత్స అందించేందుకు ఆలస్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. లిబియాకు అల్జీరియా, తుర్కియే, యూఏఈ, ఈజిప్ట్, టునీసియా తమ సహాయక బృందాలను, మందులను పంపించాయి. ఈ విపత్తులో అతలాకుతలమైన లిబియాకు సాయం కోసం అత్యవసర నిధులు పంపుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.