సిఎం దృష్టికి జేపీఎస్ ల సమస్య తీసుకెళ్తా ఎమ్మెల్సీ శేరి హామీ

సిఎం దృష్టికి జేపీఎస్ ల సమస్య తీసుకెళ్తా ఎమ్మెల్సీ శేరి హామీ

ముద్ర ప్రతినిధి, మెదక్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హామీనిచ్చారు. మెదక్ జిల్లాకు చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్విసు రెగ్యులరైజేషన్ విషయమై సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో కలసి వినతి పత్రం అందించారు. ఈ విషయమై ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో 2019 సంవత్సరములో పోటీ పరీక్ష ద్వారా నియామకమై నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తి చేశామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. నోటిఫికేషన్ ప్రకారం మొదటగా మూడేళ్లకే రెగ్యులరేషన్ చేస్తామని తరువాత ఒక సంవత్సరంపెంచినప్పటికీ తాము అందరము ముఖ్యమంత్రి సూచనతో కష్టపడి పని పనిచేయడంతో గ్రామపంచాయతీల పరిపాలన మెరుగుపడిందని తెలిపారు.

గ్రామపంచాయతీలకు జాతీయ అవార్డులు రావడంలో తమ పాత్ర కూడా ఉందని పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్సీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులతో మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల కష్టనష్టాలను ప్రభుత్వం గుర్తించిందని అందుకే రెండున్నర ఏళ్లకే వారికి పే స్కేల్ తో సమానమైన వేతనాన్ని అందిస్తూ ఉన్నదని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవద్దని.. ఉద్యోగులకు కడుపునిండా జీతాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని..

ఈ విషయమై త్వరలోనే శుభవార్త వింటారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అలాగే గ్రామపంచాయతీలో నెలకొన్న ఉన్న సమస్యలను పరిష్కరించాలని.. వైకుంఠధామాల చుట్టూ వచ్చే హరితహారంలో బయోఫెన్సింగ్ చేసే విధంగా కార్యదర్శులు అందరూ కృషి చేయాలని.. తడి పొడి చెత్త వేరు చేసే విధంగా కూడా పనిచేయాలని కార్యదర్శులకు ఎమ్మెల్సీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీని కలిసిన వారిలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీశైలం, నారాయణ, నాగరాజు, శ్యామల, నాగరాణి, లిఖిత, తదితర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు ఉన్నారు.