మండలిలో పోడు భూముల సమస్యపై గళమెత్తిన ఎమ్మెల్సీ శేరి

మండలిలో పోడు భూముల సమస్యపై గళమెత్తిన ఎమ్మెల్సీ శేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్ లో పోడు భూముల సమస్య, గిరిజన సంక్షేమంపై  సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గాలకమెత్తారు. తన అభిప్రాయాలను సభ ముందు ఉంచారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు గత 75 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వము కూడా పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్  మాత్రం పోడు భూములపై గిరిజనులకు పట్టాలిచ్చి ఉపశమనం కల్పించడం గొప్ప విషయం అన్నారు. ఈ పోడు భూముల పట్టాల అమలు కార్యక్రమంలో అధికారుల వలన కొన్ని పొరపాట్లు జరిగాయని వాటిని సభ దృష్టికి తీసుకువచ్చారు. మెదక్ జిల్లాలోని చాలా గ్రామాల్లో ఒక రెవెన్యూ గ్రామం పరిధిలో రెండు, మూడు గ్రామాలు ఉంటే ఆ రెవెన్యూ గ్రామం పేరు ఉన్న గ్రామానికి సంబంధించిన దరఖాస్తులను మాత్రమే పరిగణించి, ఇతర గ్రామాల దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకోలేదని తెలిపారు. మరికొన్ని గిరిజన గ్రామాల్లో అసలు దరఖాస్తులను స్వీకరించలేదని ఇలాంటి వారికి అవకాశం ఎప్పుడు కల్పిస్తారు, ప్రభుత్వం ద్వారా చెప్తే వారు ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉంటారన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట (ఆర్) మండలం ఎస్.కొండాపూర్, జంగరాయి గ్రామాల్లో ప్రజలు వందల ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను తమ భూములుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారని, అలాగే ఆ గ్రామాల్లోని కొన్ని ఇండ్లను సైతం తమ అటవీ పరిధిలో ఉన్నాయని అటవీ అధికారులు వాదిస్తున్నారని ఎమ్మెల్సీ సభ దృష్టికి తెచ్చారు.  ఈ భూ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వారిలో గిరిజనులు, గిరిజనేతరులు సైతం ఉన్నారని ఎమ్మెల్సీ అన్నారు. 

ఈ విషయంలో ప్రభుత్వం మానవతా కోణంలో పరిశీలించి ఆ గ్రామాల ప్రజల సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని సంబంధిత మంత్రిని కోరారు. అలాగే 2020 మార్చ్ నెలలో మెదక్ జిల్లాలోని తన స్వగ్రామం అయిన కూచనపల్లిలో పందుల వలన మెదడువాపు వ్యాధి వస్తుందనే ఉద్దేశంతో పందుల పెంపకం చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని స్థానిక నాయకుల సహకారంతో వారిని అధికారులు ఒప్పించడం జరిగిందని ఎమ్మెల్సీ తెలిపారు. 2022 జనవరి నెలలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు పందుల పెంపకం మానేసిన ఎరుకల సోదరులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఈ విషయమై అదే నెలలో ట్రైకార్ కమిషనర్ కు మెదక్ జిల్లా కలెక్టర్ లేఖను రాశారని ఎమ్మెల్సీ సభకు తెలిపారు. అయితే ఈ మధ్యన ట్రైకార్ లో పందుల పెంపకంపై సమావేశం జరిగిందని తాను విన్నాను, 5 ఎకరాల భూమి తమకు ఇస్తే పందుల పెంపకం చేస్తామని కొన్ని సంఘాలు అడిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. 

అయితే పారిశుద్ధ కారణాల దృష్ట్యా పందుల పెంపకాన్ని గ్రామాల్లో ఎవరూ ఒప్పుకోరని, అంతేగాక గ్రామ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలకే భూసేకరణ కష్టంగా మారిన నేపథ్యంలో పందుల పెంపకానికి ఐదు ఎకరాల భూమిని సేకరించడం  కష్ట సాధ్యమైన పని అని సభకు ఎమ్మెల్సీ తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి పందుల పెంపకం చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిని కల్పించి వారిని ఆదుకోవాలని సంబంధిత మంత్రిని ఎమ్మెల్సీ కోరారు. పోడు భూములు, గిరిజన సంక్షేమంపై శాసనమండలిలో మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించినందుకు శాసనమండలి చైర్మన్ కు ఎమ్మెల్సీ కృతజ్ఞతలు తెలిపారు.