సుపరిపాలన అందిస్తామన్న కాంగ్రెస్ చేసిందేమీ లేదు

సుపరిపాలన అందిస్తామన్న కాంగ్రెస్ చేసిందేమీ లేదు
  • మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: పదేళ్ల కేసీఆర్ పాలనలో నియంతృత్వాన్ని చూశామని, మాకు ఓటేస్తే సుపరిపాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చేసిందేమిటని మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. బోడుప్పల్  ఎన్టీయార్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి భారీ ఎన్నికల  ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కేరింతలతో కదం తొక్కుతూ బీజేపీకే తమ ఓటు వేసి గెలిపిస్తామని చెబుతూ, ఈ ర్యాలీకి హాజరైన వేలాది మంది మహిళా మణులకు శిరసువంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

    కాంగ్రెస్ పై ఎన్నో ఆశలతో పేద ప్రజానీకం అధికారాన్ని అప్పగిస్తే, ఆ పేదలను దోచుకోవడమే పనిగా కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆరు గ్యారంటీలను ఎరగా చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది తప్ప, ఇంకా చేసిందేమీ లేదని, మిగిలిన హామీలు ఏవీ అమలు కాలేదని ఆయన విమర్శించారు. బోడుప్పల్ ప్రాంతంలో అనేక మంది పేద ప్రజానీకం తమ సొంత స్థలాలకు సరైన పత్రాలు లేక, రెవెన్యూ ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. బోడుప్పల్ ప్రాంతంలో అనేక సర్వే నెంబర్లు వక్ఫ్ భూముల పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో ఎందరో సొంత స్థలంలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న వారికి వక్ఫ్ పేరుతో నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. ముఖ్యంగా బోడుప్పల్ ప్రాంతంలో ఈ సమస్య అధికంగా వుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య ఇంకా కొనసాగుతోందని, ఇంకా చాలా సర్వే నెంబర్ల భూములు వక్ఫ్ పేరుతో బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడం లేదని అన్నారు. జీరో కరెంట్ బిల్లుల పేరుతో వంచించారని, సెలూన్లు, రజకులు, ఇతర వృత్తి పనివారలకు కూడా జీరో బిల్లులు రావడం లేదని అన్నారు. ప్రతి మహిళలకు కులం, మతంతో సంబంధం లేకుండా నెలకు 2500 రూపాయలు భృతి కల్పిస్తామని చెప్పి వంచించారని అన్నారు. మహిళలు ఎవరికీ కూడా ఈ సహాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు, బీజేపీకి ఓటేసి తనను గెలిపించడం ద్వారా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని బలపర్చాలని ఈటెల రాజేందర్ కోరారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారానే భారత దేశం పటిష్టంగా ఉంటుందని, ప్రగతి బాటలో పయనిస్తుందని తెలిపారు. ప్రపంచ దేశాల సరసన భారత్ సగర్వంగా ముందువరసలో నిలవాలంటే అది బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. అందుకే బీజేపీకి ఓటేసి తనను గెలిపించడం ద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని కోరారు.

    అంతకుముందు ఈ ర్యాలీ మల్లికార్జున ఆలయం వద్ద మొదలై వాటర్ ట్యాంక్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎన్టీయార్ సర్కిల్ కు చేరుకుంది. వేలాది మంది మహిళలు ర్యాలీలో పాల్గొని బీజేపీ నినాదాలు, భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో తొలుత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ, పిలిస్తే పలికే మన ఈటెల రాజేందర్ కు ఓటేసి మల్కాజిగిరిలో బీజేపీని గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కప్పరగళ్ల కరుణాకర్, బోడుప్పల్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, పెద్దసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.